కేంద్ర సర్కార్ మరో బాంబు పేల్చింది.
శనివారం అర్థరాత్రి నుంచి ప్రయాణాల్లో పాత నోట్లు చెల్లవంటు
ప్రకటించింది. ముందుగా ప్రకటించిన ప్రకటన ప్రకారం పాత నోట్ల
చెల్లుబాటు డిసెంబర్ 15 వరకు ఉండేది. అయితే ఆ తేదిని కుదిస్తూ మరో తాజా
ప్రకటన విడుదల చేసింది కేంద్ర సర్కార్. రైలు, బస్సు, సబర్బన్,
మెట్రో టికెట్ల కొనుగోలుకు డిసెంబర్ 10 అంటే శనివారం అర్ధరాత్రి నుంచి పాత
రూ.500 నోట్లు చెల్లవు అని దీని సారాంశం.
దీంతో ప్రయాణాల్లో ఉన్న సామాన్యులు షాక్
కు గురవుతున్నారు. సడన్ గా ఇలా నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటంటూ
ప్రశ్నిస్తున్నారు. నోట్ల రద్దు జరిగి ఇప్పటికే నెల గడిచిపోయిన కొత్త
నోట్లు పూర్తి స్థాయిల్లో చేతిలోకి రాలేదని.. చిల్లర కష్టాలు తీవ్రంగా
ఉన్నాయని వాపోతున్నారు. 5 రోజులు పొడగించాల్సింది పోయి.. గడువును
కుదిస్తారంటూ మండిపడుతున్నారు. ఇక తాజా ప్రకటన ప్రకారం ప్రయాణానికి
కొత్త నోట్లను వాడాల్సిందే. లేదా చలామణీలో ఉన్న పాత రూ.100, 50, 20, 10, 5
నోట్లను, నాణేలను వినియోగించుక తప్పని పరిస్థితి.
పాత నోట్లు ఇంకా ఎక్కడ చెల్లుబాటవుతాయంటే..
- డిసెంబర్ 15 న వరకు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యచికిత్సలకు
- వైద్యుల అనుమతితో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందుల షాపుల్లో మందులు కొనుగోలు చేసేందుకు..
- గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపునకు, గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు
- స్మశానాల్లో దహనసంస్కారాలకు
- ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఫీజుల చెల్లింపునకు
- పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని కట్టడాల సందర్శన టికెట్లకు డిసెంబరు 15 దాకా పాత రూ.500 నోట్లను అనుమతిస్తారు.
- ఇక పాత 1000 నోటు కేవలం బ్యాంకులో డిపాజిట్ కు తప్ప ఎక్కడ పని చేయడం లేదన్నది తెలిసిందే.