cricket ad

Saturday, 10 December 2016

ప్రభువు ఎవరు?

ఏసు ఎవరు? లోక రక్షకుడా? కేవలం ఒక కార్యాన్ని నిర్వర్తించటానికి వచ్చిన దైవదూతా? లేక ఎప్పుడూ మనని కనిపెట్టి ఉండే దేవుడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బైబిల్‌లో దొరుకుతుంది..

‘నేనే ద్వారమును.. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును’ (యోహాను 10:9) ఈ వాక్యాన్ని విడివిడిగా విశ్లేషిస్తే క్రీస్తుతత్వం అర్థమవుతుంది.

నేనే ద్వారమును: యొహోవాను చేరటానికి ఏసు తప్ప వేరే మార్గము లేదు. ఆయన సూచించిన మార్గంలో ప్రయాణిస్తే ఎలాంటి అలసట ఉండదు. మెరుగైన జీవితం పొందగలుగుతారు. దైనందిక జీవితంలో శాంతి, సంతోషాలు లభిస్తాయి. ఇవన్నీ కావాలంటే ఏసు అనే ద్వారం నుంచే అందరూ ప్రవేశించాలి.

‘ఎవడైనను’- అనే పదాన్ని ఉపయోగించటం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అవసరాలను తానే తీరుస్తాననే భరోసాను క్రీస్తు ఇస్తున్నాడు.

‘రక్షింపబడినవాడై’- ఈ ప్రపంచంలో అడుగడుగునా అనేక ప్రమాదాలుంటాయి. వీటిన్నింటినీ సురక్షితంగా దాటాలంటే అపరిమితమైన ప్రేమ, కరుణలతో పాటుగా అభేధ్యమైన శక్తి కూడా అవసరం. వీటన్నింటినీ మనకు క్రీస్తు ప్రసాదిస్తాడు. ఆయన సహవాసంలో జీవించేవారు తప్పకుండా రక్షణ పొందుతారు. ఆయన సున్నిత హస్తాలు, మృదువైన మనసు, తేజోవంతమైన వర్ఛస్సును అనుభూతి చెందగలుగుతారు. కాబట్టే ‘ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడును’ అని ప్రభువు సెలవిచ్చాడు. నిజాయితీగా మనను మనం క్రీస్తుకు అర్పించుకుంటే- ఆయన మన తరపున పోరాడతాడు.

‘లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును’-
అనే వాక్యం లోపల నిగూఢమైన అర్థం ఉంది. ఈ వాక్యంలో మనిషి ఆనందంగా జీవించటానికి అవసరమైన భద్రత, వనరులు, పని- ఈ మూడింటినీ తానే అందిస్తానని క్రీస్తు చెబుతున్నాడు. అంతే కాకుండా గొర్రెలమైన మనల్ని దారి తప్పకుండా ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకుపోయే బాధ్యతను కూడా ప్రభువు తనపై వేసుకున్నాడు.

ఈ వాక్యం ఆధారంగా చూస్తే నిజాయితీగా ప్రభువును స్తుతించటం ద్వారానే నిజమైన సుఖసంతోషాలు లభిస్తాయనే విషయం అర్థమవుతుంది.
 
ఆయన సున్నిత హస్తాలు, మృదువైన మనసు, తేజోవంతమైన వర్ఛస్సును అనుభూతి చెందగలుగుతారు. నిజాయితీగా మనను మనం క్రీస్తుకు అర్పించుకుంటే- ఆయన మన తరపున పోరాడతాడు.

No comments:

Post a Comment