చూడగానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. దాదాపుగా ఎవరైనా నెయ్యిని ఇష్టంగానే తింటారు. పచ్చడి, పప్పు, కారం పొడి వంటి కూరల్లో నెయ్యిని కలుపుకుని తింటే… ఆహా… అప్పుడు వచ్చే రుచే వేరు కదా..! అలాంటి రుచిని దాదాపుగా ఏ నాన్ వెజ్ వంటకమూ ఇవ్వలేదేమో. అంతటి టేస్ట్‌ను నెయ్యి మాత్రమే అందిస్తుంది. అయితే నెయ్యి ఎంత రుచిగా ఉన్నా కొందరు మాత్రం దాన్ని తినేందుకు అయిష్టతను ప్రదర్శిస్తారు. ఎందుకంటే బరువు పెరుగుతామనో, లేదంటే ఇతర అనారోగ్యాలు కలుగుతాయనో చాలా మంది నెయ్యిని తినేందుకు ఆసక్తి చూపరు. కానీ నెయ్యి తినడం వల్ల అలాంటి నష్టమేమీ కలగదు. అన్నీ లాభాలే ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నెయ్యి ఇతర నూనెలలా కాదు. దీన్ని తింటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ వంటి సమస్యలు ఉండవు.
2. దృష్టి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేడు మన దేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారు నెయ్యిని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో విటమిన్ ఎ పుష్కలంగా లభించి తద్వారా నేత్ర సమస్యలు పోతాయి.
3. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావన చాలా మందిలో ఉంది. అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచదు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.
4. గర్భిణీ మహిళలైతే నిత్యం నెయ్యిని కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే దాంతో ఎన్నో కీలక పోషకాలు గర్భిణీ స్త్రీలకు లభిస్తాయి. దాంతోపాటు పిండం చక్కగా ఎదుగుతుంది కూడా.
5. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ముఖంపై ఉండే మచ్చలు, ముడతలు, మొటిమలు కూడా పోతాయి.
6. బరువు తగ్గాలనుకునే వారు కూడా నిర్భయంగా నెయ్యిని తినవచ్చు. అయితే మోతాదుకు మించకుండా చూసుకోవాలి.
7. స్వీట్లలో నెయ్యిని కాకుండా, రసం, సాంబార్, పప్పు, కూర వంటి వాటిలో నెయ్యిని వేసి వండి ఆ వంటకాలను తింటే దాంతో సహజంగానే మనం నెయ్యిని తిన్నట్టు అవుతుంది. దాంతో పైన చెప్పిన లాభాలు కూడా కలుగుతాయి.
8. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి. అందువల్ల నెయ్యిని తింటుంటే శరీరంపై అయిన గాయాలు, పుండ్లు ఇట్టే తగ్గిపోతాయి. పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా లభిస్తుంది.
9. నెయ్యిని నిత్యం తింటుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
10. ఆయుర్వేద ప్రకారం నెయ్యి పాజిటివ్ ఫుడ్. ఇది మిగతా కొవ్వులు, నూనెల్లా కాదు. శరీరానికి ఎంతో మంచిది.
11. శరీరంపై కాలిన గాయాలు ఉంటే కొద్దిగా నెయ్యిని ఆ ప్రాంతంలో రాసి చూడండి. దీంతో ఆ గాయం ఇట్టే తగ్గిపోతుంది.