భస్మాసురుడు.. శివుడిని తనలో కలుపుకోవాలన్న అత్యాశతో ఆయన కోసం వేట మొదలుపెడుతాడు. లోకకళ్యాణార్థం శివుడు రాక్షస రాజైన భస్మాసురుడి నుంచి తప్పించుకొని ఓ గుహలో దాక్కుంటాడు. మరీ ఇంతకీ ఆ గుహలు ఎక్కడున్నాయి.. ఈ భువిపైన శివుడు రహస్యంగా దాక్కున్న ప్రాంతం ఎక్కడో తెలుసుకోవాలనుందా. అయితే సహ్యాద్రి పర్వాతాలకు వెళ్లాల్సిందే.
కర్నాటక లోని పడమటి కనుమలలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య చుట్టు రాతి నిర్మాణాలు కలిగిన అత్యంత సుందర ప్రాంతం యానా. అక్కడికి చేరుకోవాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్నపనే. చుట్టు దట్టమైన అటవి ప్రాంతం.. ఎత్తైన కొండలు.. వాటిపై నుంచి ముగ్థమనోహరంగా జాలు వారే జలపాతాలు. వాటిని దాటుకుంటే వెళితే తప్ప యానా చేరుకోలేము. అక్కడే ఉంది శివుడు దాక్కున్న కొండ భైరవేశ్వర శిఖరం. ఈ గుహలోనే శంకరుడు రాక్షసరాజు భస్మాసురుడికి దొరకకుండా రహస్యంగా దాక్కున్నాడని పురాణ ఇతిహాసలు చెపుతున్నాయి. చరిత్ర చెపుతున్నట్టుగానే ఇది అత్యంత రహస్యమైన ప్రాంతంగానే కనిపిస్తుంది. ఇక్కడ చిత్రవిచిత్రాలు చాలానే కనిపిస్తాయి. చుట్టు చిమ్మ చీకట్లు ఉన్న ఆ గుహలోని శివలింగం పై మాత్రం ఎప్పుడు వెలుతురు పడుతూనే ఉంటుంది దానికి కారణం.. ఆకాశం నుంచి నేరుగా ఆ ప్రాంతానికి మార్గం ఉన్నట్టుగా తోచే కొండ ఆకారమే.
ఇక శివుడిని జగత్తుకు కనిపించకుండా భస్మాసురుడికి అసలే కనిపించకుండా అడ్డుగా నిలిచిన కొండగా పేరు గాంచింది మోహినీ పర్వతం. యానా గుహాలలో జగన్మోహిని అనే ఒక రాతి నిర్మాణం ఉంది. పురాణాల ప్రకారం శివుడిని కాపాడేందుకు మోహినీ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు గా భక్తులు ఈ రాతిని పూజిస్తారు.
ఇంత దట్టమైన కొండల మధ్య ఓ జలధార పర్యాటకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొండల పక్క నుంచి వెళుతున్న పర్వత రోహికులకు జలధార శబ్థాలు వినిపిస్తాయి కానీ ఎక్కడ ఆ ఆనవాళ్లు కనిపించవంట. అయితే యానా గుహలలో రాళ్ళ గుండా ప్రవహించే నీరు ఏకంగా ఓ నదిగా మారుతాయని చెపుతున్నారు. చండీహోల్ అనే నదిగా ఏర్పడి ఆది అఘనాశిని అనే మరో నదిలో ఉప్పిన పట్టణం వద్ద ఈ నీళ్లు కలుస్తాయంట. గుహలలో ప్రవహించే ఈ నీరు శివుడి జఠాజూటం నుంచి ఉద్భవిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం.
భైరవేశ్వర శిఖరం మహాఅద్బుతంగా కనిపిస్తుంది. స్వయంభూ గా వెలిసిన శివలింగం ఇక్కడ ప్రత్యేకత. అంతే కాకుండా దుర్గా మాత అవతారమైన చంద్రిక కాంస్య విగ్రహం కూడా ఈ భైరవేశ్వర కోనలో ఉన్నాయి. యానా ప్రాంతంలో విభూతి జలపాతాలు ప్రసిద్ధి గాంచినవి. 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడే ఈ జలపాతం పర్యాటకులకు, పర్వత రోహకులకు ఆనందాన్ని కలిగిస్తుంది.
No comments:
Post a Comment