ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే...'' మీ ఇంట్లో మీరే పరాయి వారు అవుతారని జీవితం నేర్పుతున్న సత్యం దానికి ఉదాహరణనే ఈ చిన్న కథ.
.
నేను
క్రమం తప్పకుండా ఇందిరా పార్కుకి వాకింగ్కి వెళుతుంటాను. రోజూ నడిచే
రోడ్డే కాని, ఈ రోజు కొత్తగా ఉంది. ఎందుకంటే హృదయానందకరమైన దృశ్యాన్ని
చూశాను. రోజులాగే ఈరోజు వాకింగ్ని పూర్తి చేసుకొని బయటికి వచ్చి పక్కనే
ఉన్న టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగుతున్నాను.
.
అప్పుడే ముసలి
దంపతులు డబ్బులు అడుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆకలితో ఉన్నట్లు వారి
ముఖాలే చెబుతున్నాయి. ఎందుకంటే వారు చాలా బలహీనంగా ఉన్నారు.
.
నడవలేక
నడుచుకుంటూ అందరిని డబ్బులు అడుక్కుంటున్నారు. అలాగే నా దగ్గరకు వచ్చి
అడిగారు. వారు డబ్బులు అడగ్గానే దానికి బదులుగా వారికి ఛారు, బిస్కెట్లు
ఆఫర్ చేశాను.
.
వారు తిన్న తర్వాత అసలు వారిది ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని నాకున్న అనుమానాలను ప్రశ్నల వర్షం కురిపించాను.
.
అప్పుడు వారు చెప్పిన కథ విని చలించిపోయాను.
మీరు చదవండి. కథ వారి మాటల్లోనే...
.
''మాది
మార్కాపురం బాబు. ఒక్కడే కొడుకు. వాడి కోసం ఉన్న రెండు ఎకరాలు అమ్మి
చదివించాం. రోజూ కూలీ కెళ్లి వచ్చిన దానితోనే కడుపు నింపుకుంటూ వాడిని
పెద్ద చదువులు చదివించినం. బాగా చదువుకున్నాడు కద మంచి ఉద్యోగం వచ్చిందని
ఆరు నెలల క్రితం హైదరాబాదుకు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటికి
రాలేదు, ఫోను చేస్తున్న ఎత్తడం లేదు. ఫోను నెంబరు మార్చినాడట. ఇక్కడే ఎవరో
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటున్నాడని తెలిసింది. మా ఊరబ్బాయి చూసి
ఫోను చేశాడు. మేము హైదరాబాదు వచ్చి రెండు రోజులైంది. మాకు ఫోను చేసిన
అబ్బాయి కలవలేదు, ఫోను ఎత్తడం లేదు. ఈ రెండు రోజుల్లో మేము తెచ్చుకున్న
డబ్బులు కూడా అయిపోయాయి. మా ఊరికి పోవడానికి కూడా డబ్బులు లేవు బాబు.
అందుకే ఇలా అడుక్కుంటున్నాం బాబు'' అని తన బాధను వివరించాడు.
వారి
కొడుకు కనిపించడం లేదని వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. అది వారి కళ్ళల్లో
కన్నీటి రూపంలో వ్యక్తమవుతుంది. అందుకే వారి నిష్కళంకమైన మాతృ హృదయానికి
చలించి, వారి బస్సు ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించాను. అప్పుడు వారు
ఏమన్నారో తెలుసా ''మీ అమ్మ, నాన్న చల్లంగుండాలి బాబు'' అని. అప్పుడు నాకు
ఎంతో సంతోషం వేసింది. కాని అంతలోనే బాధ కూడా వేసింది.
.
ఒక్కసారి
మీ గుండెలపై చెయ్యి వేసుకొని ఆలోచించండి. మనం ఎదుగుతున్న కొద్ది మారుతున్న
ఆధునిక పోకడలలో పడి లోకజ్ఞానాన్ని కూడా మరిచిపోతున్నాం. నేను ఏ ఒక్క
వ్యక్తి గురించో మాట్లాడటం లేదు. అందరి గురించి అంటున్నాను. నేటి సమాజంలో
తల్లిదండ్రులను ఏవిధంగా వదిలించుకుంటున్నారో రోజు పేపర్లలో చూస్తూనే
ఉన్నాం. కాని తల్లిదండ్రులు మన సుఖం కోసం, మన ఎదుగుదల కోసం ఏవిధంగా
కష్టపడుతున్నారో కూడా ఆలోచించడం లేదు. మన స్వార్ధం మనం చూసుకొని వారిని
రోడ్డుపాలు చేస్తున్నాం.
.
తల్లిదండ్రులేమో మనం అడగ్గానే
అస్తులు కూడా అమ్మి అన్ని సమకూరుస్తున్నారు. వారికంటూ ఏమి మిగిలించుకోవడం
లేదు. ఏమన్నా అంటే నాకు చెట్టంత కొడుకుండగా ఇక ఏం కావాలి, వాడే నన్ను
చూసుకుంటాడని అంటున్నారు. అందుకే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక్కసారి
ఆలోచించండి.
.
రేపటిరోజు మీరు ఒక తల్లి, తండ్రి అన్న సంగతి
మరవకండి. మనం తల్లిదండ్రులను గౌరవించినప్పుడే సమాజం మనల్ని గౌరవిస్తుంది.
(నెట్ నుండి మీకోసం)