పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొంత మంది బ్యాంకు సిబ్బంది నల్లకుబేరులతో కుమ్మక్కై అక్రమాలకు తెరతీశారు. కమిషన్ తీసుకుని పాత నోట్లను భారీ ఎత్తున మారుస్తున్నారు. ఈ క్రమంలో, బ్యాంకులకు డబ్బు వస్తున్నప్పటికీ, సామాన్యులకు మాత్రం అందుబాటులోకి రాకుండా పోతోంది. దీంతో, ఈ అంశంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా 54 బ్యాంకులపై ఈడీ దాడులు నిర్వహించింది. బ్యాంకులపై దాడి చేసి, తనిఖీలు నిర్వహిస్తోంది. డబ్బు రవాణా, మనీ లాండరింగ్ అంశాలపై కూడా ఆరా తీస్తోంది. ఈడీ దాడులు చేసిన బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంకులన్నీ ఉన్నాయి.
ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇటీవలే పలువురు బ్యాంకు అధికారులపై కేంద్రం కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. పలువురి సస్పెండ్ చేయడంతో పాటు పలువురిని బదిలీ చేసింది.