cricket ad

Tuesday, 13 December 2016

హ్యాపీ బ‌ర్త్‌డే గురూ..!

ఈ రోజు ఫ్యామిలీ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన రోజు. ‘విక్టరీ’ని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్‌. తెలుగు చిత్ర సీమకు నాలుగు మూలస్తంభాలుగా అభివర్ణించే అగ్ర నటుల్లో ఒకరైనా ఆ అహమే ఉండదు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ తనయుడైనా ఆ అతిశయమన్నదే కనిపించదు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా ముఖంలో చిరునవ్వు చెరగదు. అవార్డులెన్ని అందుకున్నా అణకువ మారదు. అందుకే ఆయన సమ్‌థింగ్‌ స్పెషల్‌. నటనలోనే కాదు. నిజ జీవితంలోనూ అంతే. మంగళవారం వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.

నేటి నుంచే ఈ ఆఫర్ అమలు

పెట్రోల్ బంకుల్లో కార్డుల ద్వారా డబ్బు చెల్లింపుపై 0.75శాతం రాయితీ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆఫర్ ఈ రోజు నుంచి అమల్లో ఉంటుందని తెలిపింది. మొదట పూర్తి బిల్లు కార్డు నుంచి కట్ అయి ఆ తర్వాత మూడు రోజుల్లో డిస్కొంట్ మొత్తం వెనక్కి వస్తుందట. ప్రస్తుత ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ పై 49పైసలు, లీటర్ డీజిల్ పై 41 పైసలు రాయితీ పొందవచ్చని కేంద్రం పేర్కొంది. క్రెడిట్, డెబిట్, ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్ల ద్వారా పీఎస్‌యూ(ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్) బంకుల్లో పెట్రోల్ కొనుగోళ్లకు ఈ రాయితీ వర్తిస్తుందని వివరించింది.


విజయరథ చక్రాలు
 
‘‘మాతరం ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి అత్యుత్తమ ఆటగాడు’’
- ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ కుక్‌
‘‘సాధారణంగా తమ వేగంతో బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతుంటారు. మా తరంలో ఒక బ్యాట్స్‌మెన్‌ను చూస్తే బౌలర్లు భయపడేవారు. అతడు విండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌. ప్రస్తుత తరంలో విరాట్‌ను చూసి బౌలర్లు భయపడుతున్నారు
- కపిల్‌దేవ్‌
ముంబయి టెస్టులో టీమ్‌ఇండియా విజయానంతరం ఇద్దరు గొప్ప ఆటగాళ్ళు చేసిన వ్యాఖ్యలివి. ఒకప్పుడు డాన్‌ బ్రాడ్‌మన్‌ గొప్ప అనేవాళ్లు. వివ్‌ రిచర్డ్స్‌ను చూశాక అలాంటోడు మళ్లీ వస్తాడా అనుకున్నారు. ఇక సచిన్‌ తెందుల్కర్‌ సాగించిన రికార్డుల వేట తర్వాత మరో మాస్టర్‌ బ్లాస్టర్‌ అసాధ్యమే అనిపించింది! కానీ ఆటలో అసాధ్యమన్నదే లేదనడానికి విరాట్‌ కోహ్లి ప్రత్యక్ష ఉదాహరణ. క్రికెట్‌ చరిత్రలో బ్రాడ్‌మన్‌, రిచర్డ్స్‌, సచిన్‌ గొప్ప బ్యాట్స్‌మెన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి సరసన నిలవడానికి ప్రస్తుత క్రికెట్లో అన్ని అర్హతలు ఉన్న ఏకైక ఆటగాడు విరాట్‌ మాత్రమే. నైపుణ్యం.. షాట్లు ఆడటంలో నలుగురిలో ఎవరి శైలి వారిదే. టన్నులకొద్దీ పరుగులు రాబట్టడంలోనూ అంతే. ఐతే తానాడుతూ అవతలి ఎండ్‌లో ఉన్న సహచర ఆటగాడినీ పరుగులు చేసేలా చేయడం కోహ్లిలోనే ఉన్న అరుదైన ప్రత్యేకత. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ మురళీ విజయ్‌.. కేవలం 2 టెస్టుల అనుభవమే ఉన్న కుర్ర జయంత్‌ యాదవ్‌లు కోహ్లి అండతో శతకాలు చేయడమే ఇందుకు నిదర్శనం. ఆటలో గెలుపోటమలు సహజమే అయినా కొంతమంది ఆటగాళ్లు తమ అసాధారణ నైపుణ్యంతో క్రీడాభిమానులపై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వాళ్లలో కోహ్లిది ముందు వరుసే. ట్వంటీ20లు, వన్డేలు, టెస్టులు.. ఫార్మాట్‌ ఏదైనా పరుగుల వరద సృష్టించడం ఈ దిల్లీ బ్యాట్స్‌మన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తీవ్ర పోటీతత్వం.. అంతకంటే ఎక్కువ దూకుడు.. రెట్టించిన ఉత్సాహం అడుగడుగునా ప్రదర్శించే విరాట్‌ ఎప్పుడైనా, ఎక్కడైనా గెలుపు మంత్రమే.
‘‘స్వదేశీ పిచ్‌లపై కోహ్లి బాగా రాణిస్తాడు’’ ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్‌ చేసిన తెంపరి వ్యాఖ్య ఇది. కానీ కోహ్లి మెరుగైన ప్రదర్శన భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. ఆసీస్‌పై అతడు ఆడిన ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. గొప్ప బ్యాట్స్‌మన్‌కు స్టేడియాలు.. పిచ్‌లు.. పరిస్థితులు.. బౌలర్లతో పెద్దగా పనుండదు. మస్తిష్కంలో లక్ష్యం.. కళ్ళముందు బంతి మాత్రమే ఉంటాయి. దృఢమైన పట్టుదల.. రెట్టింపు ఆత్మవిశ్వాసమే బ్యాటులో కనిపించే లక్షణాలు. ఇక కోహ్లి చేసిన శతకాల్లో సగానికిపైగా విదేశాల్లో నమోదైనవే కావడం అండర్సన్‌ అజ్ఞానానికి నిదర్శనం! మొదట్లో ఆఫ్‌స్టంప్‌ ఆవలపడ్డ బంతులను వేటాడి ఔటయ్యే బలహీనత కోహ్లిలో కనిపించేది. కఠోర శ్రమ.. పట్టుదలతో బలహీనతను అధిగమించిన కోహ్లిని అడ్డుకోవడం బౌలర్లకు శక్తికి మించిన పనిలా మారింది. స్పిన్నర్లు, పేసర్లు సంధించే అన్ని రకాల బంతులకు ప్రస్తుతం కోహ్లీ దగ్గర దీటైనా జవాబులున్నాయి. అనుభవంతో వచ్చిన పరిణతితో విరాట్‌లో నిలకడ పెరిగింది. సెంచరీల్ని అవలీలగా ద్విశతకాలుగా మారుస్తున్నాడు. వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌లపై వరుస సిరీస్‌ల్లో విరాట్‌ మూడు ద్విశతకాలు సాధించాడు. ధారాళంగా పరుగులు రాబట్టే బ్యాట్స్‌మన్‌గా.. స్ఫూర్తి రగిలించే నాయకుడిగా.. మొత్తంగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో 128 సగటుతో ఇప్పటికే 640 పరుగులు సాధించి.. మూడు విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సాంకేతికంగా అత్యుత్తమ ఆటతీరుతో అలరిస్తున్న విరాట్‌ భవిష్యత్తులోనూ టీమ్‌ఇండియాకు మరిన్ని విజయాలు అందిస్తాడనడంలో సందేహం లేదు.
‘‘ఇటీవలి సిరీస్‌ల్లో టీమ్‌ఇండియా గెలుపునకు 60 శాతం కారణం రవిచంద్రన్‌ అశ్విన్‌. నా బ్యాటింగ్‌ సైతం అశ్విన్‌ ప్రతిభ తర్వాతే’’ అన్నది అశ్విన్‌ బౌలింగ్‌పై కోహ్లి మాట. ఏదేమైనా కోహ్లి పరుగులు.. అశ్విన్‌ వికెట్లు, పరుగులు టీమ్‌ఇండియా విజయాలకు ప్రధాన కారణాలన్నది స్పష్టం. గడిచిన అన్ని సిరీస్‌ల్లో అశ్విన్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ.. భారీగా వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్లకు పెద్ద స్కోర్లు సాధ్యంకాలేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల నైపుణ్యం అశ్విన్‌ది. స్పిన్‌కు పెద్దగా సహకరించని పిచ్‌లపైనా అశ్విన్‌ తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తుండటం గొప్ప విషయమే. తానాడిన 43 టెస్టుల్లో 24 సార్లు 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడమే అశ్విన్‌ ప్రతిభకు నిదర్శనం. ముంబయి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆరేసి వికెట్లు తీయడంతో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండా ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. అశ్విన్‌, కోహ్లి భారత్‌ విజయరథానికి రెండు చక్రాలనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!

ఫోర్బ్స్‌లో ఇద్దరు భారతీయ అమెరికన్లు

న్యూయార్క్‌: అమెరికాలో సంపన్నులైన పారిశ్రామికవేత్తల జాబితానుప్రముఖ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ విడుదల చేసింది. 40ఏళ్లలోపు వయసు కలిగిన సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లకు చోటు లభించింది. కాగా, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. బయోటెక్‌ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి 24వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద విలువ 600 మిలియన్‌ డాలర్లు. ఇక అపూర్వ మెహతా 360 మిలియన్‌ డాలర్ల సంపదతో 31 స్థానాన్ని దక్కించుకున్నారు.
రామస్వామి(31), హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో విద్యను అభ్యసించారు. బయోటెక్‌ రంగంలో కంపెనీని స్థాపించి వృద్ధి పథంలో దూసుకుపోతున్నారని ఫోర్బ్స్‌ తెలిపింది. ఈయన కంపెనీ 2016లో స్టాక్‌మార్కెట్‌లో ముందస్తు పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీవో)కు వచ్చింది. దీని ద్వారా ఆయన 218 మిలియన్‌ డాలర్ల షేర్లను నాస్‌డాక్‌లో విక్రయించారు.
ఇక మెహతా సిలికాన్‌ వ్యాలీలోని యువ పారిశ్రామిక వేత్తల్లో ఒకరుగా నిలిచారని ఫోర్బ్స్‌ అభివర్ణించింది. భారత్‌లో పుట్టిన మెహతా కుటుంబం 2000 సంవత్సరంలో కెనడాకు వచ్చారు. వాటర్లూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. అనంతరం బ్లాక్‌ బెర్రీ, క్వాల్కమ్‌, అమెజాన్‌లలో పనిచేశారు. 2012లో నిత్యావసరాలను సరఫరా చేసే సంస్థ ‘ఇన్‌స్టాకార్ట్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. వినియోగదారులు మొబైల్‌ యాప్‌ ద్వారా నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవచ్చు. 10 డాలర్లు చెల్లించడం ద్వారా రెండు గంటల్లోపు సరకులను పొందవచ్చు. మెహతా నిర్వహిస్తున్న ఈ కంపెనీ విలువ 2 బిలియన్‌ డాలర్లు అని ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచిన జుకర్‌బర్గ్‌ 50 బిలియన్‌ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.

డిజిటల్‌ ఇక జిగేల్‌ కొత్త పుంతలు తొక్కనున్న నగదు రహిత లావాదేవీలు నాలుగేళ్ల తర్వాత నోట్లు నామమాత్రమే

ఇదో మార్పు. వూహించని విప్లవం. వూహకందనంత వేగంగా జరుగుతున్న మార్పు. కష్టార్జితాన్ని నోట్ల రూపంలో చూసుకుని మురిసిపోయే ఈ దేశ ప్రజలు ఇప్పుడు శరవేగంగా డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లుతున్న కొంగొత్త పోకడ. దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహిస్తోన్న కొత్త నీరు ఇది. రాబోయే నాలుగేళ్లలో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయన్న కన్సల్టింగ్‌ సంస్థల అంచనాలు ఈ మార్పునకు విస్పష్ట సూచికలు.
వినియోగంలో ఉన్న సౌలభ్యం, త్వరగా లావాదేవీ పూర్తిచేసే అవకాశం, నమ్మకం... తదితర ప్రయోజనాల వల్ల భారతీయులు మొదట్నుంచీ నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో నగదు వాటా ఎంతో అధికంగా 18 శాతం ఉంటుంది. అదే బ్రిటన్‌లో 3.5 శాతం, అమెరికాలో 8 శాతం మాత్రమే. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా మనదేశంతో పోలిస్తే బ్రెజిల్‌, చైనా వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2015 లో మొత్తం చెల్లింపుల్లో నగదు చెల్లింపుల వాటా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో 20 నుంచి 25 శాతం ఉండగా, మనదేశంలో మాత్రం ఎంతో అధికంగా 78 శాతం ఉన్నాయి. మిగిలిన 22 శాతం లావాదేవీల్లో డిజిటల్‌ పద్ధతిలో జరిగిన లావాదేవీలు 13 శాతం కాగా, 7 శాతం కార్డు చెల్లింపులు, 2 శాతం చెక్కుల ద్వారా జరిగిన చెల్లింపులు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితి ఇకపై ముందు పూర్తిగా మారిపోనుంది. నగదు ప్రధాన ఇంధనంగా నడిచే మనదేశ ఆర్థిక వ్యవస్థకు డిజిటల్‌ చెల్లింపులు వెనుదన్నుగా నిలవనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయమైన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రధాన కారణం.
అంచనాల కంటే మిన్నగా... 
వాస్తవానికి గత కొంతకాలంగా మనదేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతూ వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వాడకం అధికం కావటం, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావటం, బ్యాంకింగ్‌ సేవల విస్తృతి, డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల జారీ అదికం కావటం, మొబైల్‌ వ్యాలెట్లు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ... తదితర కారణాల వల్ల డిజిటల్‌ దిశగా మనదేశం అడుగులు వేస్తోంది. అందుకే భారతదేశంలో డిజిటల్‌ లావాదేవీల పరిమాణం గణనీయంగా పెరగబోతోందని, ఇది నగదు చెల్లింపుల పరిశ్రమలోని సంస్థలకు మేలు చేసే అంశమని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) ఈ ఏడాది జులై లో రూపొందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2020 నాటికి మనదేశంలో డిజిటల్‌ చెల్లింపులు 500 బిలియన్‌ డాలర్లకు (రూ.34 లక్షల కోట్లు) చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మొత్తం 40 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్ల వరకూ ఉంది. ఈ అంచనా ఆరు నెలల క్రితం నాటిది. గత నెల 8న ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన నిర్ణయంతో పరిస్థితి మారిపోయి డిజిటల్‌ లావాదేవీలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. డిజిటల్‌ లావాదేవీలు ఒక్కసారిగా అధికం అవుతున్నాయి. దీంతో 2020 నాటికి బీసీజీ అంచనా వేసిన మొత్తం కంటే ఎంతో అధికంగా డిజిటల్‌ లావాదేవీలు నమోదు అవుతాయని స్పష్టమవుతోంది.
ప్రస్తుత చెల్లింపుల స్థితి... 
* దేశీయంగా 2015 లో నమోదైన మొత్తం చెల్లింపుల్లో నగదు చెల్లింపులు 78 శాతం ఉన్నాయి. 2010 లో నగదు చెల్లింపులు 89 శాతం, 2005లో 92 శాతం ఉండటం ప్రత్యేకత. పదేళ్ల కాలంలో నగదు చెల్లింపులు 14 పర్సెంటేజీ పాయింట్ల మేరకు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. 
* నగదు లావాదేవీల సంఖ్యను 2023 నాటికి నగదు రహిత లావాదేవీలు మించిపోతాయని బీసీజీ (బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌) తన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం 2015 లో 22 శాతం ఉన్న నగదు రహిత లావాదేవీలు 2020 నాటికి 40 శాతానికి పెరగనున్నాయి. 2025 నాటికి 59 శాతానికి పెరుగుతాయి. 
* నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ఉన్న డిజిటల్‌ లావాదేవీలు 2020 నాటికి 26 శాతానికి, 2025 నాటికి 37 శాతానికి పెరుగుతాయని అంచనా. మొబైల్‌ వ్యాలెట్‌, స్టోర్‌ క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ కార్డులు, గిఫ్ట్‌ కార్డుల వాడకం గణనీయంగా విస్తరించే అవకాశం ఉంది.
చెల్లింపుల పరిశ్రమకు మంచి రోజులు 
డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్న ఫలితంగా మనదేశంలో అతిపెద్ద చెల్లింపుల పరిశ్రమ రూపుదిద్దుకోనుంది. బీజీసీ అంచనా ప్రకారం 2020 నాటికి డిజిటల్‌ చెల్లింపుల పరిశ్రమ టర్నోవర్‌ 5 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 3,40,000 కోట్లు) చేరుతుంది. దీని ప్రకారం చూస్తే ఈ విభాగంలో కార్యకలాపాలు సాగించే సంస్థలకు ఆకాశమే హద్దుగా వ్యాపార అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులు తయారు చేసే సంస్థలకు/ పీఓఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) యంత్రాలు తయారు చేసే సంస్థలకు ఇప్పటికే పెద్దఎత్తున కొత్త ఆర్డర్లు లభిస్తున్నాయి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయనేదానికి ఇవన్నీ సంకేతాలే.

కేరళ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆరుగురు అరెస్టు

తిరువనంతపురం: అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయగీతం ప్రదర్శించే సమయంలో ఆరుగురు వ్యక్తులు లేచి నిలబడకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురంలోని నిషాగాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఈజిప్టు చిత్రాన్ని ప్రదర్శించే ముందు జాతీయగీతాన్ని ప్రదర్శించారు.



 ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరైన ఆరుగురు వ్యక్తులు జాతీయగీతం వచ్చే సమయంలో లేచి నిలబడలేదు. పోలీసులు, ఐఎఫ్‌ఎఫ్‌కే నిర్వాహకులు, ఛైర్మన్‌ కమల్‌తో పాటు పలువురు.. వారిని నిలబడమని కోరినా తిరస్కరించారు. దీంతో పోలీసులు ఆ ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా జాతీయగీతం ప్రదర్శించే ముందు యువత లేచి నిలబడకపోవడంపై భాజపా యూత్‌ వింగ్‌ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం చెన్నైలోను ఇలాంటి ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

స్టార్‌ హీరోయిన్‌ నోట షాకింగ్‌ మాట

చిన్నతనంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ అన్నారు. అనుష్క శర్మ, విద్యాబాలన్‌, రాధికా ఆప్టే, ఆలియాభట్‌లతో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సోనమ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో సినీ విమర్శకుడు రాజీవ్‌ మసంద్‌తో సోనమ్‌ మాట్లాడుతూ.. 




‘నాకు తెలుసు. చిన్నవయసులోనే నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ అనుభవం చాలా బాధాకరంగా ఉంటుంది’ అన్నారు. నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తైన ఆమె ఈ మాట అనడంతో ఆ చర్చలో పాల్గొన్నవారే కాక చిత్ర పరిశ్రమ, ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.



2016 సంవత్సరంలో బాలీవుడ్‌లో తమ నటనా సామర్థ్యంతో మంచి విజయాలు సాధించిన నటీమణులతో రాజీవ్‌ మసంద్‌ ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇలా తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకోవడం ద్వారా మిగిలిన మహిళల్లో చైతన్యం కలుగుతుందనే ఈ అంశాన్ని చర్చించినట్లు వారు పేర్కొన్నారు. మొదటినుంచి చాలా నిర్మొహమాటంగా మాట్లాడతారన్న పేరున్న సోనమ్‌ ఇక్కడ కూడా తనదైన శైలిలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.