cricket ad

Tuesday, 13 December 2016

డిజిటల్‌ ఇక జిగేల్‌ కొత్త పుంతలు తొక్కనున్న నగదు రహిత లావాదేవీలు నాలుగేళ్ల తర్వాత నోట్లు నామమాత్రమే

ఇదో మార్పు. వూహించని విప్లవం. వూహకందనంత వేగంగా జరుగుతున్న మార్పు. కష్టార్జితాన్ని నోట్ల రూపంలో చూసుకుని మురిసిపోయే ఈ దేశ ప్రజలు ఇప్పుడు శరవేగంగా డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లుతున్న కొంగొత్త పోకడ. దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవహిస్తోన్న కొత్త నీరు ఇది. రాబోయే నాలుగేళ్లలో డిజిటల్‌ లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయన్న కన్సల్టింగ్‌ సంస్థల అంచనాలు ఈ మార్పునకు విస్పష్ట సూచికలు.
వినియోగంలో ఉన్న సౌలభ్యం, త్వరగా లావాదేవీ పూర్తిచేసే అవకాశం, నమ్మకం... తదితర ప్రయోజనాల వల్ల భారతీయులు మొదట్నుంచీ నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో నగదు వాటా ఎంతో అధికంగా 18 శాతం ఉంటుంది. అదే బ్రిటన్‌లో 3.5 శాతం, అమెరికాలో 8 శాతం మాత్రమే. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా మనదేశంతో పోలిస్తే బ్రెజిల్‌, చైనా వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2015 లో మొత్తం చెల్లింపుల్లో నగదు చెల్లింపుల వాటా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో 20 నుంచి 25 శాతం ఉండగా, మనదేశంలో మాత్రం ఎంతో అధికంగా 78 శాతం ఉన్నాయి. మిగిలిన 22 శాతం లావాదేవీల్లో డిజిటల్‌ పద్ధతిలో జరిగిన లావాదేవీలు 13 శాతం కాగా, 7 శాతం కార్డు చెల్లింపులు, 2 శాతం చెక్కుల ద్వారా జరిగిన చెల్లింపులు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితి ఇకపై ముందు పూర్తిగా మారిపోనుంది. నగదు ప్రధాన ఇంధనంగా నడిచే మనదేశ ఆర్థిక వ్యవస్థకు డిజిటల్‌ చెల్లింపులు వెనుదన్నుగా నిలవనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయమైన రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రధాన కారణం.
అంచనాల కంటే మిన్నగా... 
వాస్తవానికి గత కొంతకాలంగా మనదేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతూ వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వాడకం అధికం కావటం, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావటం, బ్యాంకింగ్‌ సేవల విస్తృతి, డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల జారీ అదికం కావటం, మొబైల్‌ వ్యాలెట్లు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ... తదితర కారణాల వల్ల డిజిటల్‌ దిశగా మనదేశం అడుగులు వేస్తోంది. అందుకే భారతదేశంలో డిజిటల్‌ లావాదేవీల పరిమాణం గణనీయంగా పెరగబోతోందని, ఇది నగదు చెల్లింపుల పరిశ్రమలోని సంస్థలకు మేలు చేసే అంశమని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) ఈ ఏడాది జులై లో రూపొందించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2020 నాటికి మనదేశంలో డిజిటల్‌ చెల్లింపులు 500 బిలియన్‌ డాలర్లకు (రూ.34 లక్షల కోట్లు) చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మొత్తం 40 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్ల వరకూ ఉంది. ఈ అంచనా ఆరు నెలల క్రితం నాటిది. గత నెల 8న ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన నిర్ణయంతో పరిస్థితి మారిపోయి డిజిటల్‌ లావాదేవీలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. డిజిటల్‌ లావాదేవీలు ఒక్కసారిగా అధికం అవుతున్నాయి. దీంతో 2020 నాటికి బీసీజీ అంచనా వేసిన మొత్తం కంటే ఎంతో అధికంగా డిజిటల్‌ లావాదేవీలు నమోదు అవుతాయని స్పష్టమవుతోంది.
ప్రస్తుత చెల్లింపుల స్థితి... 
* దేశీయంగా 2015 లో నమోదైన మొత్తం చెల్లింపుల్లో నగదు చెల్లింపులు 78 శాతం ఉన్నాయి. 2010 లో నగదు చెల్లింపులు 89 శాతం, 2005లో 92 శాతం ఉండటం ప్రత్యేకత. పదేళ్ల కాలంలో నగదు చెల్లింపులు 14 పర్సెంటేజీ పాయింట్ల మేరకు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. 
* నగదు లావాదేవీల సంఖ్యను 2023 నాటికి నగదు రహిత లావాదేవీలు మించిపోతాయని బీసీజీ (బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌) తన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం 2015 లో 22 శాతం ఉన్న నగదు రహిత లావాదేవీలు 2020 నాటికి 40 శాతానికి పెరగనున్నాయి. 2025 నాటికి 59 శాతానికి పెరుగుతాయి. 
* నగదు రహిత లావాదేవీల్లో భాగంగా ఉన్న డిజిటల్‌ లావాదేవీలు 2020 నాటికి 26 శాతానికి, 2025 నాటికి 37 శాతానికి పెరుగుతాయని అంచనా. మొబైల్‌ వ్యాలెట్‌, స్టోర్‌ క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ కార్డులు, గిఫ్ట్‌ కార్డుల వాడకం గణనీయంగా విస్తరించే అవకాశం ఉంది.
చెల్లింపుల పరిశ్రమకు మంచి రోజులు 
డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్న ఫలితంగా మనదేశంలో అతిపెద్ద చెల్లింపుల పరిశ్రమ రూపుదిద్దుకోనుంది. బీజీసీ అంచనా ప్రకారం 2020 నాటికి డిజిటల్‌ చెల్లింపుల పరిశ్రమ టర్నోవర్‌ 5 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 3,40,000 కోట్లు) చేరుతుంది. దీని ప్రకారం చూస్తే ఈ విభాగంలో కార్యకలాపాలు సాగించే సంస్థలకు ఆకాశమే హద్దుగా వ్యాపార అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులు తయారు చేసే సంస్థలకు/ పీఓఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) యంత్రాలు తయారు చేసే సంస్థలకు ఇప్పటికే పెద్దఎత్తున కొత్త ఆర్డర్లు లభిస్తున్నాయి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయనేదానికి ఇవన్నీ సంకేతాలే.

No comments:

Post a Comment