న్యూయార్క్: అమెరికాలో సంపన్నులైన పారిశ్రామికవేత్తల జాబితానుప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. 40ఏళ్లలోపు వయసు కలిగిన సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లకు చోటు లభించింది. కాగా, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. బయోటెక్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి 24వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద విలువ 600 మిలియన్ డాలర్లు. ఇక అపూర్వ మెహతా 360 మిలియన్ డాలర్ల సంపదతో 31 స్థానాన్ని దక్కించుకున్నారు.
రామస్వామి(31), హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యను అభ్యసించారు. బయోటెక్ రంగంలో కంపెనీని స్థాపించి వృద్ధి పథంలో దూసుకుపోతున్నారని ఫోర్బ్స్ తెలిపింది. ఈయన కంపెనీ 2016లో స్టాక్‌మార్కెట్‌లో ముందస్తు పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కు వచ్చింది. దీని ద్వారా ఆయన 218 మిలియన్ డాలర్ల షేర్లను నాస్‌డాక్‌లో విక్రయించారు.
ఇక మెహతా సిలికాన్ వ్యాలీలోని యువ పారిశ్రామిక వేత్తల్లో ఒకరుగా నిలిచారని ఫోర్బ్స్ అభివర్ణించింది. భారత్‌లో పుట్టిన మెహతా కుటుంబం 2000 సంవత్సరంలో కెనడాకు వచ్చారు. వాటర్లూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. అనంతరం బ్లాక్ బెర్రీ, క్వాల్కమ్, అమెజాన్‌లలో పనిచేశారు. 2012లో నిత్యావసరాలను సరఫరా చేసే సంస్థ ‘ఇన్‌స్టాకార్ట్’ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవచ్చు. 10 డాలర్లు చెల్లించడం ద్వారా రెండు గంటల్లోపు సరకులను పొందవచ్చు. మెహతా నిర్వహిస్తున్న ఈ కంపెనీ విలువ 2 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచిన జుకర్‌బర్గ్ 50 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.
No comments:
Post a Comment