విజయరథ చక్రాలు
‘‘మాతరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లి అత్యుత్తమ ఆటగాడు’’
- ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్
‘‘సాధారణంగా తమ వేగంతో బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతుంటారు. మా తరంలో ఒక బ్యాట్స్‌మెన్‌ను చూస్తే బౌలర్లు భయపడేవారు. అతడు విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్. ప్రస్తుత తరంలో విరాట్‌ను చూసి బౌలర్లు భయపడుతున్నారు
- కపిల్‌దేవ్
ముంబయి టెస్టులో టీమ్‌ఇండియా విజయానంతరం ఇద్దరు గొప్ప ఆటగాళ్ళు చేసిన వ్యాఖ్యలివి. ఒకప్పుడు డాన్ బ్రాడ్‌మన్ గొప్ప అనేవాళ్లు. వివ్ రిచర్డ్స్‌ను చూశాక అలాంటోడు మళ్లీ వస్తాడా అనుకున్నారు. ఇక సచిన్ తెందుల్కర్ సాగించిన రికార్డుల వేట తర్వాత మరో మాస్టర్ బ్లాస్టర్ అసాధ్యమే అనిపించింది! కానీ ఆటలో అసాధ్యమన్నదే లేదనడానికి విరాట్ కోహ్లి ప్రత్యక్ష ఉదాహరణ. క్రికెట్ చరిత్రలో బ్రాడ్‌మన్, రిచర్డ్స్, సచిన్ గొప్ప బ్యాట్స్‌మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి సరసన నిలవడానికి ప్రస్తుత క్రికెట్లో అన్ని అర్హతలు ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ మాత్రమే. నైపుణ్యం.. షాట్లు ఆడటంలో నలుగురిలో ఎవరి శైలి వారిదే. టన్నులకొద్దీ పరుగులు రాబట్టడంలోనూ అంతే. ఐతే తానాడుతూ అవతలి ఎండ్‌లో ఉన్న సహచర ఆటగాడినీ పరుగులు చేసేలా చేయడం కోహ్లిలోనే ఉన్న అరుదైన ప్రత్యేకత. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్ మురళీ విజయ్.. కేవలం 2 టెస్టుల అనుభవమే ఉన్న కుర్ర జయంత్ యాదవ్‌లు కోహ్లి అండతో శతకాలు చేయడమే ఇందుకు నిదర్శనం. ఆటలో గెలుపోటమలు సహజమే అయినా కొంతమంది ఆటగాళ్లు తమ అసాధారణ నైపుణ్యంతో క్రీడాభిమానులపై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వాళ్లలో కోహ్లిది ముందు వరుసే. ట్వంటీ20లు, వన్డేలు, టెస్టులు.. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద సృష్టించడం ఈ దిల్లీ బ్యాట్స్‌మన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తీవ్ర పోటీతత్వం.. అంతకంటే ఎక్కువ దూకుడు.. రెట్టించిన ఉత్సాహం అడుగడుగునా ప్రదర్శించే విరాట్ ఎప్పుడైనా, ఎక్కడైనా గెలుపు మంత్రమే.
‘‘స్వదేశీ పిచ్‌లపై కోహ్లి బాగా రాణిస్తాడు’’ ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ చేసిన తెంపరి వ్యాఖ్య ఇది. కానీ కోహ్లి మెరుగైన ప్రదర్శన భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. ఆసీస్‌పై అతడు ఆడిన ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. గొప్ప బ్యాట్స్‌మన్‌కు స్టేడియాలు.. పిచ్‌లు.. పరిస్థితులు.. బౌలర్లతో పెద్దగా పనుండదు. మస్తిష్కంలో లక్ష్యం.. కళ్ళముందు బంతి మాత్రమే ఉంటాయి. దృఢమైన పట్టుదల.. రెట్టింపు ఆత్మవిశ్వాసమే బ్యాటులో కనిపించే లక్షణాలు. ఇక కోహ్లి చేసిన శతకాల్లో సగానికిపైగా విదేశాల్లో నమోదైనవే కావడం అండర్సన్ అజ్ఞానానికి నిదర్శనం! మొదట్లో ఆఫ్‌స్టంప్ ఆవలపడ్డ బంతులను వేటాడి ఔటయ్యే బలహీనత కోహ్లిలో కనిపించేది. కఠోర శ్రమ.. పట్టుదలతో బలహీనతను అధిగమించిన కోహ్లిని అడ్డుకోవడం బౌలర్లకు శక్తికి మించిన పనిలా మారింది. స్పిన్నర్లు, పేసర్లు సంధించే అన్ని రకాల బంతులకు ప్రస్తుతం కోహ్లీ దగ్గర దీటైనా జవాబులున్నాయి. అనుభవంతో వచ్చిన పరిణతితో విరాట్‌లో నిలకడ పెరిగింది. సెంచరీల్ని అవలీలగా ద్విశతకాలుగా మారుస్తున్నాడు. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లపై వరుస సిరీస్‌ల్లో విరాట్ మూడు ద్విశతకాలు సాధించాడు. ధారాళంగా పరుగులు రాబట్టే బ్యాట్స్‌మన్‌గా.. స్ఫూర్తి రగిలించే నాయకుడిగా.. మొత్తంగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో 128 సగటుతో ఇప్పటికే 640 పరుగులు సాధించి.. మూడు విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సాంకేతికంగా అత్యుత్తమ ఆటతీరుతో అలరిస్తున్న విరాట్ భవిష్యత్తులోనూ టీమ్‌ఇండియాకు మరిన్ని విజయాలు అందిస్తాడనడంలో సందేహం లేదు.
‘‘ఇటీవలి సిరీస్‌ల్లో టీమ్‌ఇండియా గెలుపునకు 60 శాతం కారణం రవిచంద్రన్ అశ్విన్. నా బ్యాటింగ్ సైతం అశ్విన్ ప్రతిభ తర్వాతే’’ అన్నది అశ్విన్ బౌలింగ్‌పై కోహ్లి మాట. ఏదేమైనా కోహ్లి పరుగులు.. అశ్విన్ వికెట్లు, పరుగులు టీమ్‌ఇండియా విజయాలకు ప్రధాన కారణాలన్నది స్పష్టం. గడిచిన అన్ని సిరీస్‌ల్లో అశ్విన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ.. భారీగా వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్లకు పెద్ద స్కోర్లు సాధ్యంకాలేదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల నైపుణ్యం అశ్విన్‌ది. స్పిన్‌కు పెద్దగా సహకరించని పిచ్‌లపైనా అశ్విన్ తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తుండటం గొప్ప విషయమే. తానాడిన 43 టెస్టుల్లో 24 సార్లు 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడమే అశ్విన్ ప్రతిభకు నిదర్శనం. ముంబయి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆరేసి వికెట్లు తీయడంతో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండా ఇంగ్లాండ్ కథ ముగిసింది. అశ్విన్, కోహ్లి భారత్ విజయరథానికి రెండు చక్రాలనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!
No comments:
Post a Comment