అవును మీరు చదివింది నిజమే.. కోట్లు కురుస్తాయ్. కాకపోతే బీమా ప్రీమియం రూపంలో. బీమా సేవలపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, సంస్థల పాలిట వరంగా మారుతోంది. ఇంకా ఎంతో మంది బీమాకు దూరంగా ఉండటం, వ్యాపార వృద్ధికి అపార అవకాశాలు ఉండటంతో 2020 నాటికి రూ.26 లక్షల కోట్ల ప్రీమియాన్ని ఆర్జించనుందని నివేదికలు చెబుతున్నాయి.మన దేశంలో వృద్ధికి అపార అవకాశాలున్న రంగాల్లో బీమా ఒకటి. 130 కోట్లకు పైబడిన జనాభా ఉన్నప్పటికీ బీమా పరిధిలో ఉన్నది కొందరే. అవగాహన లేకపోవడంవల్లనో, అందుబాటులో సేవలు లభించకనో చాలా మంది బీమాకు దూరంగా ఉండి పోతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. బీమా సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం వివిధ రకాల చర్యలు చేపడుతోంది. తక్కువ ప్రీమియానికే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకాలను తీసుకొచ్చింది. బీమా విపణి వృద్ధి చెందేందుకు ఇది ఎంతగానో దోహదపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. 49 శాతం వరకు వాటాను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో విదేశీ నిధులు తరలి వస్తున్నాయి. బీమా రంగం వృద్ధికి, మరిన్ని నాణ్యమైన సేవలు అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక విదేశీ సంస్థలు దేశీయ బీమా కంపెనీల్లో తమ వాటాలను పెంచుకున్నాయని, మరెన్నో సంస్థలు ఇటువైపు ఆసక్తిగా చూస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
విపణి తీరు ఇలా..: ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద బీమా విపణుల్లో మనదీ ఒకటి. దాదాపు 36 కోట్ల పాలసీలతో జీవిత బీమా ప్రపంచంలోనే పెద్ద విపణిగా ఉంది. ఏప్రిల్ 2015-మార్చి 2016 మధ్య జీవిత బీమా విపణి దాదాపు 22 శాతం వృద్ధితో రూ.1.38 లక్షల కోట్ల కొత్త ప్రీమియాన్ని నమోదు చేసినట్లు అంచనా. ఇదే సమయంలో సాధారణ బీమా విపణి 12 శాతం వృద్ధితో సుమారు రూ.10,500 కోట్ల కొత్త ప్రీమియాన్ని ఆర్జించింది. రానున్న అయిదేళ్లలో జీవిత బీమా ఏడాదికి 12-15% వృద్ధిని నమోదు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జీవితా బీమా వాటా 2.6% కాగా, సాధారణ బీమా వాటా 0.7 శాతంగా ఉన్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఇందువల్ల 2020 నాటికి మొత్తం బీమా విపణి ప్రీమియం దాదాపు రూ.26 లక్షల కోట్లకు చేరొచ్చని సీఐఐ-కేపీఎంజీ నివేదిక అంచనా వేస్తోంది.
ఇలా చేస్తే మరింత మేలు.. బీమాపై సరైన అవగాహన లేని వారు ఇప్పటికీ ఉన్నారు. వీరందరిని చైతన్య పరిచేందుకు ప్రభుత్వం తనవంతుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు ఈ దిశగా బీమా సంస్థలు కూడా చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా వినూత్న పథకాలను తీసుకు రావడంతోపాటు, పథకాల పంపిణీ వ్యవస్థను సంస్కరించాలని చెబుతున్నారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా మరిన్ని వర్గాలకు బీమా సేవలను చేరువ చేయాలని సలహా ఇస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో వ్యాపార వృద్ధికి మంచి అవకాశాలుంటాయని అభిప్రాయపడుతున్నారు.