పరిచయం స్నేహమైంది....జీవితం వరమైంది
రోజురోజుకీ మా స్నేహం గాఢత పెరిగిపోతోంది. ఎక్కడ దూరం అవుతామో అనే భయం కూడా. మరోవైపు మేం ఆ అమ్మాయిలతో ప్రేమలో పడ్డామనే ప్రచారం మొదలైంది. సురేశ్ సంగతేంటో తెలీదుగానీ సిరిపై నాకు రోజురోజుకీ ఇష్టం పెరిగిపోతోంది. ఒక ఫ్రెండ్ ఓరోజు మొహంమీదే అడిగేశాడు. ఫ్రెండ్షిప్పా? ప్రేమా? ఏదీ చెప్పలేకపోయా. వాళ్లు మాకు దూరం కావొద్దనే భయమో... వూరిలో జరుగుతున్న ప్రచార ప్రభావమో తను నా సొంతమైతే బావుణ్ననిపించింది. దానికి ఏకైక మార్గం పెళ్లి. అడగాలనిపించింది. ఒప్పుకుంటే ఫర్వాలేదు. నా ప్రతిపాదన నచ్చకపోతే? ఉన్న స్నేహం కాస్తా పాడవుద్ది. అలాగని మనసూర్కోదు. గుండెలు పిండేసినట్టుండేది.
ఓరోజు నలుగురం కలిశాం. పిచ్చాపాటీ కబుర్లయ్యాక ‘నేనో అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఇంట్లో వాళ్లని ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. మీరే సాయం చేయాలి’ సీరియస్‌గా అంది సిరి. నా గుండెలు జారిపోయాయి. కొన్ని విషయాల్ని మనసులోనే నాన్చడం ఎంత తప్పో అర్థమైంది. అప్పుడే వసంత అందుకుంది. ‘కన్నవాళ్లు మనల్ని కష్టపడి పెంచితే ఎవడో దారినపోయే దానయ్యని ప్రేమించి వాళ్లకు చెడ్డ పేరు తెస్తావా?’ అని చెడామడా తిట్టేసింది. కన్నవాళ్లని ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే కష్టాలు, వాళ్లకొచ్చే ఇబ్బందులు వివరించాడు సురేశ్. నేను సంతోషించాలో, ఏడవాలో నాకే అర్థం కాని పరిస్థితి. వాతావరణం గంభీరంగా మారింది. ‘ప్రేమ, పెళ్లి సంగతి కాసేపు వదిలేయండి. భవిష్యత్తులో మన స్నేహం ఇలాగే కొనసాగించాలని ఒట్టేయండి’ అన్నా. ముగ్గురూ నన్ను వింతగా చూశారు. ‘ఇది కొత్తగా చెప్పాలా?’ అంది వసంత. ముగ్గురూ నా చేతిలో చేయేశారు.
నెలలు, ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ మా స్నేహంలో చిన్న కుదుపు లేదు. ఒకరి కష్టసుఖాల్లో ఒకరం తోడుగా నిలుస్తూనే ఉన్నాం. ఒకమ్మాయి మనసు గెల్చుకొని తనతో జీవితాంతం నడవాలంటే భర్త హోదాతోనే అది సాధ్యం అనుకునేవాణ్ని. ఆ అభిప్రాయం మార్చుకున్నా. ‘మీరు లవర్సా?, స్నేహితులా? అన్నాచెల్లెళ్లా?’ అనే ప్రశ్నలు మాకు ఎదురవుతూనే ఉన్నాయి. ఎవరెలా ఫీలైనా ఫర్వాలేదు. మాది స్వచ్ఛమైన స్నేహం. అందుకు ప్రతిరూపంగా ఉండాలనుకుంటున్నాం. ఉంటాం.
No comments:
Post a Comment