cricket ad

Friday, 16 December 2016

దెబ్బకు దెబ్బ.. సింధు ప్రతీకార విజయం కరోలినా చిత్తుచిత్తు బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ సెమీస్‌లో తెలుగు తేజం


దెబ్బకు దెబ్బ! రియో ఒలింపిక్స్‌ ఓటమికి ప్రతీకారం. ప్రపంచ ఛాంపియన్‌కు దిమ్మతిరిగే సమాధానం. ఆటలో.. మాటలో ప్రత్యర్థిని కవ్వించే కరోలినాకు తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు షాక్‌. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో ఒలింపిక్స్‌ ఛాంప్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)కు ఇంటిదారి చూపించిన సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
దుబాయ్‌ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి
న సింధు మెరిసింది. ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో సెమీస్‌కు అర్హత సాధించింది. శుక్రవారం హమ్‌దాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన గ్రూప్‌-బి చివరి పోరులో సింధు 21-17, 21-13తో మారిన్‌ను చిత్తుచేసింది. సెమీఫైనల్లో సింధు.. కొరియా క్రీడాకారిణి సంగ్‌ హ్యున్‌ను ఢీకొంటుంది. గురువారం సున్‌ యు (చైనా) చేతిలో పరాజయంతో సెమీస్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న సింధు.. తనపై 5-2తో మంచి రికార్డున్న మారిన్‌ను తెలివిగా ఓడించింది. పూర్తిగా దూకుడుగా ఆడకుండా.. ఎదురుదాడికి పోకుండా ప్రత్యర్థిని అంతుచిక్కని రీతిలో మట్టికరిపించింది. ఒలింపిక్స్‌ ఫైనల్లో చేసిన పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త పడింది. 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ ఆసక్తికరంగా జరిగింది. తొలి గేమ్‌లో శుభారంభం చేసిన మారిన్‌ చకాచకా పాయింట్లు రాబడుతూ 3-7తో ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. వెంటనే పుంజుకున్న సింధు వరుసగా 4 పాయింట్లు గెల్చుకుని స్కోరును సమం చేసింది. ఈ సమయంలో సింధు అసాధారణ రీతిలో దూకుడు కనబరిచింది. మారిన్‌ను కోర్టు నలువైపులా తిప్పుతూ పాయింట్లు రాబట్టింది. 11-10తో ఆధిక్యంలోకి వెళ్ళిన సింధు చూస్తుండగానే 16-12తో తొలి గేమ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. మారిన్‌ ఎదురుదాడికి దిగడంతో సింధు ర్యాలీ గేమ్‌ వైపు మళ్ళింది. సుదీర్ఘ ర్యాలీలు, నెట్‌ గేమ్‌ ఆడుతూ ప్రత్యర్థిని అసహనానికి గురిచేసిన సింధు 20-14తో తొలి గేమ్‌కు చేరువైంది. మారిన్‌ వరుసగా 3 పాయింట్లు సాధించినా.. వెంటనే పాయింటు రాబట్టిన సింధు 21-17తో తొలి గేమ్‌ను ముగించింది.
‘‘రియో ఒలింపిక్స్‌ తర్వాత మేమిద్దరం తలపడిన తొలి మ్యాచ్‌ ఇదే. ఒలింపిక్స్‌ ఫైనల్లో మారిన్‌ చేతిలో ఓటమి ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. వీలైనంత త్వరగా మారిన్‌తో మ్యాచ్‌ ఉండాలని కోరుకున్నా. ఇలాంటి పెద్ద టోర్నీలో మారిన్‌ను ఓడించడం గర్వంగా ఉంది. మారిన్‌ గొప్ప క్రీడాకారిణి. ఆమెపై విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’’
- ‘ఈనాడు’తో సింధు
రెండో గేమ్‌లో ఆటంతా సింధుదే. అన్ని రంగాల్లోనూ అద్భుతంగా ఆడిన సింధు ముందు మారిన్‌ తేలిపోయింది. ఆరంభంలో 1-3తో వెనుకబడినా.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సింధు దూసుకెళ్లింది. మారిన్‌ దూకుడుకు సింధు డిఫెన్స్‌తో అడ్డుకట్ట వేసింది. చూస్తుండగానే 11-6తో ఆధిక్యం సంపాదించిన సింధు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 15-10తో సింధు గేమ్‌పై పట్టుసాధించగానే మారిన్‌ ఆశలు వదులుకున్నట్లు కనిపించింది. అదే సమయంలో సింధు ఆటలో ఒక్కసారిగా వేగాన్ని పెంచి చకచకా పాయింట్లు రాబట్టింది. పదునైన స్మాష్‌లు, డ్రాప్‌ షాట్లతో పాయింట్లు గెల్చుకున్న సింధు 20-12తో గేమ్‌కు చేరువైంది. ఆ వెంటనే 21-13తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుని దెబ్బకు దెబ్బ తీసింది. ఈ మ్యాచ్‌లో మారిన్‌ గెలిచి ఉంటే సింధు కథ ముగిసేదే! గ్రూప్‌-బిలో సున్‌ యు మూడింట్లోనూ నెగ్గగా.. సింధు, యమగూచి ఒక్కో మ్యాచ్‌లో గెలిచారు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో మారిన్‌ నెగ్గి ఉంటే ఆమెకు సెమీస్‌ వెళ్లే అవకాశాలుండేవి. ఐతే మారిన్‌ ఆశలపై నీళ్ళు చల్లుతూ సింధు ఒలింపిక్స్‌ ఓటమికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. మారిన్‌పై విజయం సెమీస్‌ ముందు సింధు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. సెమీస్‌ ప్రత్యర్థి హ్యున్‌పై సింధుకు 6-3తో మెరుగైన గెలుపోటముల రికార్డుండటం విశేషం

No comments:

Post a Comment