cricket ad

Friday, 16 December 2016

స్నేహితుల వేడుక్కి.. శ్రేయతో పాడించా!

స్నేహితుల వేడుక్కి.. శ్రేయతో పాడించా!
కోట్ల రాబడి ఉన్న కార్పొరేట్‌ సంస్థ కార్యక్రమమైనా..కోటీశ్వరుల ఇంటి పిల్లల పెళ్లైనా..కొండల్ని కరిగించే గాయకుల కచేరియైనా..ఏవీ వాళ్లకు వాళ్లే చేయలేరు! ప్రజలకు తెలిసేట్టు ప్రకటనలు ఎలా ఇవ్వాలి.. ఆద్యంతం వాళ్లని కట్టిపడేయాలంటే ఏం చేయాలి.. కార్యక్రమానికి వచ్చే అతిథులని ఎలా గౌరవించాలి.. ఇవన్నీ వాళ్లు చూసుకోవాల్సిన అవసరంలేదు. ఆ బాధ్యతల్ని ఈవెంట్‌ మేనేజర్స్‌కి అప్పగిస్తే చాలు! మధిర హరిణి అలాంటి ఈవెంట్‌ మేనేజర్‌. బాలీవుడ్‌ తారల నుంచి దేశంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థల నిర్వాహకుల దాకా తమ కార్యక్రమాల ఏర్పాటుకి ఆమె సేవలకోసం ఎదురుచూస్తున్నారిప్పుడు!ఆ రంగంలో అంతగా రాణిస్తున్న ఆమె తన విజయ యాత్రనిలా పంచుకున్నారు



కార్యక్రమం నిర్వహించడం అంత సులువేం కాదు. మనదైన సృజన ఉండాలి. వినియోగదారుల ఆలోచనలూ, ఆసక్తులను దానికి మేళవించాలి. అందరినీ మెప్పించాలి. అప్పుడే ఆదరణ ఉంటుంది. అందుకే నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. అదే నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. జీఎమ్మార్‌, ఒరాకిల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థలూ, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులెందరినో మా వినియోగదారులుగా మార్చింది. నేను పుట్టింది డెహ్రాడూన్‌ అయినా కావడానికి తెలుగువాళ్లమే. నాన్న ఓఎన్‌జీసీ ఉద్యోగి. నా చదువంతా దిల్లీలో సాగింది. నాన్నకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే నా చిన్నతనంలో ఇంట్లో తరచూ కచేరీలూ జరిగేవి. ఆ ప్రభావంతో నేనూ సంగీతంలో పీజీ చేశా. తరవాత నాకు ప్రఖ్యాత రికార్డింగ్‌ కంపెనీ ‘హెచ్‌ఎమ్‌వీ’లో పనిచేసే అవకాశం లభించింది. అక్కడ నా పని సంగీత కళాకారులతో ఆల్బమ్‌లు చేయడం. అక్కడయ్యాక మరో రెండు సంస్థల్లోనూ పనిచేశా. ఈలోగా పెళ్లవడంతో హైదరాబాద్‌ వచ్చేశా. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పర్యటక శాఖవాళ్లు ఓ కార్యక్రమం కోసం సంగీతకళాకారుల్ని తీసుకొస్తారా అని అడిగారు. నేను అంతకముందు చేసిన పనే కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నా. కానీ అలాంటి సేవల్ని మళ్లీ కొనసాగించలేదు. మా వారి ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరిగి హైదరాబాద్‌ వచ్చాక నేనంటూ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. సంగీతాన్ని, పాటల్ని సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ‘‘సిస్నే ఫర్‌ ఆర్ట్స్‌’’ పేరుతో 2005లో ఈ సంస్థను ప్రారంభించా. నా పని ప్రముఖ గాయకుల్ని ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించడం. అలా ఇప్పటివరకూ జగ్జీత్‌ సింగ్‌, గుల్జార్‌, ఎల్‌.సుబ్రహ్మణ్యం, సోనూ నిగమ్‌, జాకిర్‌ హుసేన్‌, అంజాద్‌ అలీఖాన్‌, శ్రేయాఘోషల్‌ వంటి ప్రముఖులతో కార్యక్రమాలు చేశా. 2010లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రేయాఘోషల్‌తో ‘‘ఫ్రెండ్స్‌ ఫరెవర్‌’’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశా. అదే వేడుకను కైలాష్‌ ఖేర్‌తోనూ చేశా. జాకీర్‌ హుసేన్‌, మరో ఇద్దరు గ్రామీ అవార్డు విజేతలను ఇక్కడకు తీసుకొచ్చి కార్యక్రమాలు చేశా. సింగపూర్‌, యూకె, న్యూజిలాండ్‌ వంటి వివిధ దేశాల్లోనూ మా సంస్థ తరఫున ఏర్పాటు చేశా.
ఆడపిల్లవు నువ్వేం చేస్తావన్నారు..
కార్పొరేట్‌ సంస్థల కోసం ఉత్పత్తి ప్రదర్శనలు, వార్షికోత్సవాలు, థీమ్‌ వేడుకలను నిర్వహించడం మొదలుపెట్టా. కాకపోతే ఇది పూర్తిగా పురుషాధిక్యత ఉన్న రంగం. మొదట్లో ‘ఆడపిల్లవు నువ్వేం చేయగలవు’’ అన్నారు. అవకాశమిచ్చినా మా వల్ల పొరపాట్లు ఏవయినా జరిగితే వెంటనే గుర్తించి తిడదామని ఎదురు చూసేవారు. మగవాళ్లే ఓ పనిని బాగా చేస్తారని ఎక్కడా లేదు కదా.. అందుకే నేను వాళ్ల మాటల్ని సవాలుగా తీసుకున్నా. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. వందశాతం కష్టపడ్డా. మేం నిర్వహించే కార్యక్రమాలకు సమయమంటూ ఉండదు. అటు ఇంటినీ, పనినీ సమన్వయం చేసుకోవడం కూడా పెద్ద విషయమే. ఆ శ్రమే.. నాకు గుర్తింపు తెచ్చింది. మేం అందించే సేవల గురించి పెద్దగా ప్రచారం చేయకపోయినా కేవలం నోటిమాటద్వారానే అవకాశాలు వరుస కట్టాయి. కాగ్నిజెంట్‌, ఐబీఎమ్‌, జీఎమ్మాఎర్‌ వంటి అనేక సంస్థల్లో పలు రకాల కార్యక్రమాలు చేశా. ఇన్ఫోసిస్‌ సంస్థ మ్యాజిక్‌ ఇల్యూజన్‌ పేరుతో ఉద్యోగుల పిల్లలకోసం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. హ్యారీపోటర్‌, జిమ్మీ వంటి పాత్రలతో దాన్ని ఏర్పాటు చేశాం. అదే కాదు.. కాగ్నిజెంట్‌ సంస్థకోసం అరేబియన్‌ నైట్స్‌ థీమ్‌తో పాటూ, గోవా, బాలీవుడ్‌కెమెరా వంటి అనేక అంశాలతో కార్యక్రమాలూ రూపొందిస్తుంటా. ఇలాంటివాటికి తగినట్లుగా దుస్తులూ మేమే అందిస్తాం.
 

ఆగస్ట్‌ ఫెస్ట్‌ నిర్వహించా..
సందర్భం చెబితే చాలు దానికి సంబంధించి ఓ ప్రణాళిక రూపొందిస్తాం. ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి, ఎవరిని ఆహ్వానించాలి.. భోజనాలు, అతిథులు.. ఇలా అన్నింటి బాధ్యతా మాదే అవుతుంది. ఇప్పటివరకూ మేం చేసిన వాటిల్లో భారతదేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ మీట్‌ ఆగస్ట్‌ఫెస్ట్‌ చేయడం ఓ జ్ఞాపకం. బాలీవుడ్‌లో రాజీవ్‌గాంధీ సినీ అవార్డు కార్యక్రమాన్నీ మేం నిర్వహించాం. గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చిన్నారుల చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్ని అట్టహాసంగా చేసి చూపించా. హైదరాబాద్‌లో పర్యాటకశాఖకోసం తారామతి-బారాదరి, చౌమహల్లా వంటిచోట్లా పలువేడుకలు చేశా. 2017 కొత్త సంవత్సర వేడుకలకోసం ఫలక్‌నూమాలో కార్యక్రమం చేయబోతున్నాం. ఇవన్నీ చేయడం వెనుక మాకెంతో ఒత్తిడి ఉంటుంది. అన్ని విభాగాలనూ ఒక్కతాటిపై తీసుకురావాలి. ఏ మాత్రం తడబాటు పడినా అభాసుపాలవ్వాల్సిందే. ముఖ్యంగా వేలమంది హాజరయ్యే కార్యక్రమాల విషయంలో ఎన్నో అనుమతులూ తీసుకోవడం, ఆ జనాన్ని అదుపు చేయడం పెద్ద పనే. కొన్నిసార్లు కళాకారులు సమయానికి రారు. అలాంటప్పుడు ఆ నష్టాన్నీ నేనే భరించాలి. ఆ సందర్భాలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. అయినా ఎప్పుడూ భయపడింది లేదు. మేం చేసే కార్యక్రమం.. హాజరయ్యేవారి సంఖ్య, సంస్థ ఆలోచనల్ని బట్టి డబ్బు తీసుకుంటాం.

ఇంగ్లాండ్‌ నిలిచింది తొలిరోజు 284/4 అలీ అజేయ శతకం రాణించిన రూట్‌ భారత్‌తో ఐదో టెస్టు


చెపాక్‌లో తొలి రోజు ఇంగ్లాండ్‌దే. కనీసం ఒక్క విజయంతోనైనా వూరట పొందాలనుకుంటున్న ఇంగ్లాండ్‌.. భారత్‌తో చివరిదైన ఐదో టెస్టును బలంగా ఆరంభించింది. ఆల్‌రౌండర్‌ మెయిన్‌ అలీ చక్కని శతకం సాధించిన వేళ.. కుక్‌సేన మెరుగైన స్థితిలో నిలిచింది.
చెన్నై
టెస్టు సిరీస్‌ గెలిచిన వూపులో రెట్టించిన విశ్వాసంతో చివరిటెస్టులో బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు ప్రతిఘటన ఎదురవుతోంది. తొలి రోజు ఇంగ్లాండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొయిన్‌ అలీ (120 బ్యాటింగ్‌; 222 బంతుల్లో 12×4) అజేయ శతకానికి జో రూట్‌ (88; 144 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ తోడు కావడంతో మొదటి రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 284 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (49; 90 బంతుల్లో 3×6) రాణించాడు. అలీతో పాటు స్టోక్స్‌ (5) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు మందకొడి పిచ్‌పై స్లోటర్న్‌ మాత్రమే లభించింది. అదనపు పేస్‌ వల్ల జడేజా మూడు వికెట్లు పడగొట్టగలిగాడు. మిగతా ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్‌, మిశ్రాలకు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. ఆరంభంలో మనోళ్లే..: చెపాక్‌లో టాస్‌ గెలవగానే ఇంగ్లాండ్‌ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే 21 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా ఆరంభంలో భారతే పైచేయి సాధించింది. జెన్నింగ్స్‌ను ఇషాంత్‌ ఔట్‌ చేయగా... కుక్‌ను జడేజా వెనక్కి పంపాడు.
ఆదుకున్న అలీ, రూట్‌: తొలి రోజు ఇంగ్లాండ్‌ను మెరుగైన స్థితిలో నిలిపిన ఘనత నిస్సందేహంగా మొయిన్‌ అలీదే. పట్టుదలతో ఆడిన అతడు ఆ జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. లేదంటే 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ చిక్కుల్లో పడేదే. సాధికారికంగా ఆడిన అలీ.. రూట్‌తో మూడో వికెట్‌కు 146 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. ఆ తర్వాత బెయిర్‌స్టోతో నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ను ఇంకా బలమైన స్థితికి తీసుకెళ్లాడు. ఐతే అలీ కూడా తన ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఇబ్బందిపడ్డాడు. లంచ్‌కు ముందు అశ్విన్‌ బౌలింగ్‌లో తడబడ్డాడు. లంచ్‌కు ముందు 44 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 7 పరుగులే చేశాడు. ఐతే క్రీజులో నిలదొక్కుకున్నాక ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అశ్విన్‌, జడేజా బౌలింగ్‌ల్లో స్వీప్‌లతో బౌండరీలు రాబట్టాడు. మరోవైపు రూట్‌ కూడా నియంత్రణతో ఆడడంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోయింది. లంచ్‌ తర్వాతి సెషనల్లో ఆ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అలీ మిశ్రా బౌలింగ్‌లోనూ ధాటిగా ఆడాడు. 51వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిశ్రా బౌలింగ్‌లో అతడు ఆడిన బ్యాక్‌స్వీప్‌ (బ్యాటు వెనుక భాగంతో) ఆకట్టుకుంది. రూట్‌ కూడా మంచి నైపుణ్యంతో స్వీప్‌ చేశాడు. స్వీప్‌, స్లాగ్‌ స్వీప్‌లతో మొత్తంగా అతడు ఐదు బౌండరీలు సాధించాడు. ఇతర షాట్లతోనూ అలరించాడు. అదే క్రమంలో భారత్‌పై 11వ అర్ధశతకం (11 మ్యాచ్‌ల్లో) సాధించాడు. ఐతే టీకి అరగంట ముందు రూట్‌ను జడేజా ఔట్‌ చేశాడు. భారత బౌలర్లను సమర్థంగా స్వీప్‌ చేసిన రూట్‌ చివరికి స్వీప్‌కే క్యాచ్‌ ఔటయ్యాడు. భారత అప్పీలును అంపైర్‌ తిరస్కరించినా.. అతడు సమీక్షలో ఔట్‌గా తేలాడు. రూట్‌ నిష్క్రమణతో భారత్‌ మళ్లీ పోటీలోకి వస్తుందనిపించింది. కానీ అలీ, బెయిర్‌స్టోలు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. చివరి సెషన్‌ను ధాటిగా ఆరంభించారు. బెయిర్‌స్టో ఏమాత్రం అవకాశం దక్కినా స్పిన్నర్ల బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌లు చేశాడు. వరుసగా జడేజా, అశ్విన్‌ ఓవర్లలో సిక్సర్లు కొట్టాడు. ఐతే బెయిర్‌స్టో అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో నిష్క్రమించాడు. 81వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో అతడు రాహుల్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చాడు. మరోవైపు అలీ చక్కని ఆటను కొనసాగించాడు. మిశ్రా బౌలింగ్‌లో ముందుకొచ్చి కవర్స్‌లో బౌండరీతో 99కి చేరుకున్న అతడు.. వెంటనే సింగిల్‌తో టెస్టుల్లో ఐదో శతకం పూర్తి చేసుకున్నాడు.
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: కుక్‌ (సి) కోహ్లి (బి) జడేజా 10; జెన్నింగ్స్‌ (సి) పార్థివ్‌ (బి) ఇషాంత్‌ 1; రూట్‌ (సి) పార్థివ్‌ (బి) జడేజా 88; అలీ బ్యాటింగ్‌ 120; బెయిర్‌స్టో (సి) రాహుల్‌ (బి) జడేజా 49; స్టోక్స్‌ బ్యాటింగ్‌ 5; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 284;
వికెట్ల పతనం: 1-7, 2-21, 3-167, 4-253
బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 12-1-44-0; ఇషాంత్‌ శర్మ 12-5-25-1; జడేజా 28-3-73-3; అశ్విన్‌ 24-1-76-0; అమిత్‌ మిశ్రా 13-1-52-0; కరుణ్‌ నాయర్‌ 1-0-4-0.

ఇక్కడ కోట్లు కురుస్తాయ్‌.. దూసుకుపోతున్న బీమా విపణి 2020 నాటికి రూ.26 లక్షల కోట్ల ప్రీమియం వ్యాపార వృద్ధికి అపార అవకాశాలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి సంస్థలకు నిపుణుల సూచన

అవును మీరు చదివింది నిజమే.. కోట్లు కురుస్తాయ్‌. కాకపోతే బీమా ప్రీమియం రూపంలో. బీమా సేవలపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, సంస్థల పాలిట వరంగా మారుతోంది. ఇంకా ఎంతో మంది బీమాకు దూరంగా ఉండటం, వ్యాపార వృద్ధికి అపార అవకాశాలు ఉండటంతో 2020 నాటికి రూ.26 లక్షల కోట్ల ప్రీమియాన్ని ఆర్జించనుందని నివేదికలు చెబుతున్నాయి.
న దేశంలో వృద్ధికి అపార అవకాశాలున్న రంగాల్లో బీమా ఒకటి. 130 కోట్లకు పైబడిన జనాభా ఉన్నప్పటికీ బీమా పరిధిలో ఉన్నది కొందరే. అవగాహన లేకపోవడంవల్లనో, అందుబాటులో సేవలు లభించకనో చాలా మంది బీమాకు దూరంగా ఉండి పోతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. బీమా సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం వివిధ రకాల చర్యలు చేపడుతోంది. తక్కువ ప్రీమియానికే ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకాలను తీసుకొచ్చింది. బీమా విపణి వృద్ధి చెందేందుకు ఇది ఎంతగానో దోహదపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. 49 శాతం వరకు వాటాను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో విదేశీ నిధులు తరలి వస్తున్నాయి. బీమా రంగం వృద్ధికి, మరిన్ని నాణ్యమైన సేవలు అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక విదేశీ సంస్థలు దేశీయ బీమా కంపెనీల్లో తమ వాటాలను పెంచుకున్నాయని, మరెన్నో సంస్థలు ఇటువైపు ఆసక్తిగా చూస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
విపణి తీరు ఇలా..: ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద బీమా విపణుల్లో మనదీ ఒకటి. దాదాపు 36 కోట్ల పాలసీలతో జీవిత బీమా ప్రపంచంలోనే పెద్ద విపణిగా ఉంది. ఏప్రిల్‌ 2015-మార్చి 2016 మధ్య జీవిత బీమా విపణి దాదాపు 22 శాతం వృద్ధితో రూ.1.38 లక్షల కోట్ల కొత్త ప్రీమియాన్ని నమోదు చేసినట్లు అంచనా. ఇదే సమయంలో సాధారణ బీమా విపణి 12 శాతం వృద్ధితో సుమారు రూ.10,500 కోట్ల కొత్త ప్రీమియాన్ని ఆర్జించింది. రానున్న అయిదేళ్లలో జీవిత బీమా ఏడాదికి 12-15% వృద్ధిని నమోదు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జీవితా బీమా వాటా 2.6% కాగా, సాధారణ బీమా వాటా 0.7 శాతంగా ఉన్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఇందువల్ల 2020 నాటికి మొత్తం బీమా విపణి ప్రీమియం దాదాపు రూ.26 లక్షల కోట్లకు చేరొచ్చని సీఐఐ-కేపీఎంజీ నివేదిక అంచనా వేస్తోంది.
ఇలా చేస్తే మరింత మేలు.. బీమాపై సరైన అవగాహన లేని వారు ఇప్పటికీ ఉన్నారు. వీరందరిని చైతన్య పరిచేందుకు ప్రభుత్వం తనవంతుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు ఈ దిశగా బీమా సంస్థలు కూడా చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా వినూత్న పథకాలను తీసుకు రావడంతోపాటు, పథకాల పంపిణీ వ్యవస్థను సంస్కరించాలని చెబుతున్నారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా మరిన్ని వర్గాలకు బీమా సేవలను చేరువ చేయాలని సలహా ఇస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో వ్యాపార వృద్ధికి మంచి అవకాశాలుంటాయని అభిప్రాయపడుతున్నారు.

వర్మ కొత్త చిత్రం ‘శశికళ’

ది మంది మాట్లాడుకొనే అంశాలపై సినిమా తీయడంలో రామ్‌గోపాల్‌ వర్మ ముందుంటారు. అందుకే ఆయన ఎక్కువగా వార్తల్లో విషయాల్నే లక్ష్యంగా చేసుకొంటుంటారు. ఆ తరహా సినిమాలు తీస్తున్నప్పుడు ప్రేక్షకుల చూపంతా అటువైపే ఉంటుంది. తెలిసిన విషయమే అయినా... ఏం చూపించారో, ఎలా చూపించారో అనే ఓ ఆసక్తి, ఆత్రుత ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది. రామ్‌గోపాల్‌ వర్మకి కావల్సింది కూడా అదే. అందుకే సమాజంలో ఏం జరిగినా, ఎలాంటి సంచలనం చోటు చేసుకొన్నా వెంటనే అటువైపు ఓ కన్నేస్తుంటారు. ఇటీవలే ‘నయీమ్‌’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లిన ఆయన తదుపరి ‘శశికళ’ పేరుతోనూ ఓ సినిమాని తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ పేరు ప్రముఖంగా వినిపించింది. వాళ్లిద్దరి స్నేహబంధం గురించి జాతీయస్థాయిలో ప్రచారం సాగింది. అదే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మని ఆకట్టుకుంది. అయితే వర్మ మాత్రం తాను తెరకెక్కించే కథ పూర్తిగా కల్పితమనీ, ఓ రాజకీయ వేత్తకి ప్రియమైన స్నేహితురాలి కథే అయినా, ఇది రాజకీయ నేపథ్యంతో కూడుకొన్నది మాత్రం కాదని స్పష్టం చేశారు. జయలలిత అంటే తనకి ఎంతో ఇష్టమని, అయితే శశికళ అంటే ఆమెకన్నా ఎక్కువ గౌరవమని ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు వర్మ. ‘‘జయలలిత అందరికంటే ఎక్కువగా శశికళని గౌరవించేవారనే విషయమే తన చిత్రానికి ‘శశికళ’ పేరు పెట్టడానికి కారణం. జయలలిత కళ్లతో జయలలితని చూడటం కంటే... శశికళ కళ్లతో జయలలితని చూడటం మరింత కవితాత్మకంగా ఉంటుంద’’ని ట్వీటారు వర్మ.

గౌతమిపుత్ర... నా పూర్వజన్మ సుకృతం - ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో బాలకృష్ణ

‘మనకంటూ ఓ దేశాన్ని... ఒక చరిత్రని... ఒక వారసత్వాన్ని... గౌరవాన్ని తెచ్చిపెట్టిన శక పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి వీరగాథలో నటించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. శ్రియ కథానాయిక. హేమమాలిని ముఖ్యభూమిక పోషించారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. బెబో శ్రీనివాస్‌ సమర్పిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్ర నైజాం ప్రాంత పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘శాతవాహనుల సింహ ద్వారం కోటిలింగాల. శాతకర్ణి తల్లి గౌతమి పుట్టింది ఇక్కడే. ఈ గడ్డపై మా సినిమా ప్రచార చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉంది. ఎలాంటి కథలో నటించాలా అని వందో చిత్రం గురించి సతమతమవుతున్న సమయంలో దర్శకుడు క్రిష్‌ నాకు ఈ కథ చెప్పారు. శాతకర్ణికి సంబంధించిన చరిత్ర కూడా మన దగ్గర లేదు. గుంటూరుకు చెందిన పరబ్రహ్మశాస్త్రిగారు పరిశోధన చేసి శాతవాహనులు తెలుగువాళ్లని నిరూపించారు. ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆ చరిత్ర నేపథ్యంలోనే క్రిష్‌ ఓ మంచి కథని సిద్ధం చేసుకొని నన్ను కలిశారు. సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక... ఇలా అన్ని రకాల చిత్రాల్లోనూ నేను నటించా. నా దృష్టిలో మూడే శకాలు. ఒకటి శాలివాహన శకం, మరొకటి స్వాతంత్రోద్యమం, మరొకటి ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావడం. జంబు ద్వీప కాలమాన పట్టిక ప్రకారం శాతకర్ణి సింహాసనం అధిష్ఠించినరోజే ఉగాది పండుగని చేసుకొంటున్నాం. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా శాతకర్ణిని తలచుకొని ఆ పండుగని జరుపుకొంటారు. ఇలా చరిత్రను చాటిచెప్పే చిత్రాలెన్నో అప్పట్లో నాన్నగారు ఎన్టీఆర్‌ చేశారు. అలాంటి ఓ మహానటుడికి వారసుడిగా నా కర్తవ్యంగా భావించే ఈ సినిమా చేశా. శాతకర్ణి, గాంధీజీ, ఆదిశంకరాచార్యులు, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌లాంటి యుగ పురుషులకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. పుట్టిన వూరు, ప్రాంతం, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి జన్మకి సార్థం చేకూర్చుకున్నారు. నేను నాన్నగారి అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. సాయిమాధవ్‌ అద్భుతమైన సంభాషణలు రాశారు. నిజానికి ఇంతటి చారిత్రక కథాంశాన్ని చిత్రీకరించాలంటే రెండేళ్లు పడుతుంది. కానీ మంచి సంకల్ప బలంతో మొదలెట్టిన ఈ చిత్రానికి ఎక్కడా చిన్న ఆటంకం కూడా ఎదురు కాలేదు. ప్రకృతి కూడా మా సినిమా చిత్రీకరణకు సహకరించింది’’ అన్నారు. అనంతరం చిత్రంలోని సంభాషణలు చెప్పి సభికుల్ని అలరించారు బాలకృష్ణ. దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ శౌర్యం, యుద్ధ విన్యాసాలతో సింహం బిరుదును సార్థకం చేసుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి రెండు వేల సంవత్సరాల క్రితం శత్రు దేశాలకు సింహస్వప్నం అయితే, ఈ సినిమాకు నిజమైన సింహం బాలకృష్ణ’’ అన్నారు. చిత్ర మాటల రచయిత సాయిమాధవ్‌ మాట్లాడుతూ ఈ సినిమాకు మాటలు రాయడమంటే వంద సినిమాలకు రాస్తున్నట్లుగా భావించి పనిచేశానన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల తెదేపా అధ్యక్షులు విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, బిబో శ్రీనివాస్‌, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
-న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం
ప్రత్యేక పూజలు...: గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ ఆవిష్కరణను పురస్కరించుకొని శుక్రవారం ఆయన శాతవాహనుల తొలి రాజధాని అయిన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలను సందర్శించారు. చిత్ర బృందంతో కలిసి కోటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో బాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. కోటేశ్వరస్వామి కొలువైన గడ్డపై పుట్టిన గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశాన్ని ఐక్యం చేసి విదేశీయుల మీద దండయాత్ర చేశారన్నారు. ఆయన వెంట దర్శకులు క్రిష్‌, రచయిత సాయిమాధవ్‌ తదితర చిత్ర బృందం ఉన్నారు.
- న్యూస్‌టుడే, వెల్గటూరు

దేశం మీసం తిప్పుదాం
బాలకృష్ణ ఏం చేసినా ముహూర్తం ప్రకారమే చేస్తారు. తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌ని కూడా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం శుక్రవారం సాయంత్రం సరిగ్గా 5 గంటల 38 నిమిషాలకి విడుదల చేయించారు. 2 నిమిషాల 20 సెకన్ల నిడివి వున్న ట్రైలర్‌లో దృశ్యాలు, బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విడుదలవ్వడమే ఆలస్యం... అంతర్జాలంలో హంగామా సృష్టించింది ట్రైలర్‌. తెలుగు చిత్రసీమకి చెందిన ప్రముఖులు, అభిమానులు బాలకృష్ణ సినిమా ట్రైలర్‌ గురించే మాట్లాడుకోవడం విశేషం. ‘మా జైత్రయాత్రని గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి... మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా... శరణమా, మరణమా!’ అంటూ బాలకృష్ణ చెప్పే సంభాషణతో ట్రైలర్‌ మొదలవుతుంది. ‘ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకొందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశి నెత్తుటితో ప్రక్షాళన చేసేద్దాం. దొరికినవాణ్ని తురుముదాం, దొరకనివాణ్ని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం’ అనే సంభాషణలతో పూర్తవుతుంది. ‘ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్లారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళుతున్నారు. మీరు మనిషేనా’ అంటూ వశిష్టదేవిగా శ్రియ, ‘ఈ ముప్పది మూడు కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి’ అంటూ గౌతమి పాత్రధారి హేమామాలిని చెప్పే సంభాషణలు ప్రచార చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి. ‘మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని... మహాయుద్ధాన్ని’ అనే సంభాషణ కూడా ఆకట్టుకొంటోంది. ట్రైలర్‌ని చూసిన వెంటనే ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ తదితరులు ట్విట్టర్‌ ద్వారా చిత్రబృందాన్ని అభినందించారు.
పరిచయం స్నేహమైంది....జీవితం వరమైంది
నాకు, నా ఫ్రెండ్‌ సురేశ్‌కి శ్రీకాకుళంలో ఇంటర్వ్యూ. ఉదయమే బస్సులో బయల్దేరాం. కొంచెం దూరం వెళ్లాక ‘వాళ్లేం క్వశ్చన్స్‌ అడగొచ్చంటావ్‌? జీతం సంగతి ఇప్పుడే చెబుతారా?’ ముందు సీట్లోంచి మాటలు వినపడ్డాయి. చూస్తే ఇద్దరమ్మాయిలు. మేం వెళ్తున్నచోటికే వాళ్లూ వస్తున్నారనే విషయం అర్థమైంది. ‘హలో’ అంటూ మాట కలిపాం. ‘సిరి’, ‘వసంత’ పేర్లు చెప్పారు. ఇంటర్వ్యూ ఎలా చేయాలో ఒకరికొకరం సలహాలిచ్చుకున్నాం.
మధ్యాహ్నానికే నలుగురి ఇంటర్వ్యూలయ్యాయి. ‘అరసవెళ్లి గుడికి వెళ్లొద్దామా’ అంది సిరి. మొహమాటంకొద్దీ రాలేమని చెప్పి రైల్వేస్టేషన్‌ బయల్దేరాం. ‘అమ్మాయిలే పిలుస్తుంటే నీకేంట్రా అభ్యంతరం... వెళ్తే సరదాగా ఉండేది కదా?’ సురేశ్‌ గోల. నాకూ ఉబలాటంగానే ఉంది. ఓ ఆటో మాట్లాడుకొని గుడికి బయల్దేరాం. అప్పటికే వాళ్లిద్దరు దర్శనం చేసుకొని బయటికొస్తున్నారు. జాతరలాంటి వాతావరణంలో గుడి అంతా కలియతిరిగాం. వ్యక్తిగత కబుర్లు, ఇష్టాయిష్టాలు చెప్పుకుంటూ సరదాగా గడిపాం. సాయంత్రం వీడ్కోలు తీసుకుంటుంటే మనసులో ఒకటే బాధ. ‘మన స్నేహానికి ఇంతటితో ముగింపు పలకొద్దు. అప్పుడప్పుడు కలుసుకోవాల్సిందే’ తీర్మానం చేశాం. అన్నట్టుగానే వీలున్నపుడు కలుసుకునేవాళ్లం. సినిమాలు... ముచ్చట్లు రోజులు హుషారుగా గడిచేవి.
రోజురోజుకీ మా స్నేహం గాఢత పెరిగిపోతోంది. ఎక్కడ దూరం అవుతామో అనే భయం కూడా. మరోవైపు మేం ఆ అమ్మాయిలతో ప్రేమలో పడ్డామనే ప్రచారం మొదలైంది. సురేశ్‌ సంగతేంటో తెలీదుగానీ సిరిపై నాకు రోజురోజుకీ ఇష్టం పెరిగిపోతోంది. ఒక ఫ్రెండ్‌ ఓరోజు మొహంమీదే అడిగేశాడు. ఫ్రెండ్షిప్పా? ప్రేమా? ఏదీ చెప్పలేకపోయా. వాళ్లు మాకు దూరం కావొద్దనే భయమో... వూరిలో జరుగుతున్న ప్రచార ప్రభావమో తను నా సొంతమైతే బావుణ్ననిపించింది. దానికి ఏకైక మార్గం పెళ్లి. అడగాలనిపించింది. ఒప్పుకుంటే ఫర్వాలేదు. నా ప్రతిపాదన నచ్చకపోతే? ఉన్న స్నేహం కాస్తా పాడవుద్ది. అలాగని మనసూర్కోదు. గుండెలు పిండేసినట్టుండేది.
ఓరోజు నలుగురం కలిశాం. పిచ్చాపాటీ కబుర్లయ్యాక ‘నేనో అబ్బాయిని లవ్‌ చేస్తున్నా. ఇంట్లో వాళ్లని ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. మీరే సాయం చేయాలి’ సీరియస్‌గా అంది సిరి. నా గుండెలు జారిపోయాయి. కొన్ని విషయాల్ని మనసులోనే నాన్చడం ఎంత తప్పో అర్థమైంది. అప్పుడే వసంత అందుకుంది. ‘కన్నవాళ్లు మనల్ని కష్టపడి పెంచితే ఎవడో దారినపోయే దానయ్యని ప్రేమించి వాళ్లకు చెడ్డ పేరు తెస్తావా?’ అని చెడామడా తిట్టేసింది. కన్నవాళ్లని ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే కష్టాలు, వాళ్లకొచ్చే ఇబ్బందులు వివరించాడు సురేశ్‌. నేను సంతోషించాలో, ఏడవాలో నాకే అర్థం కాని పరిస్థితి. వాతావరణం గంభీరంగా మారింది. ‘ప్రేమ, పెళ్లి సంగతి కాసేపు వదిలేయండి. భవిష్యత్తులో మన స్నేహం ఇలాగే కొనసాగించాలని ఒట్టేయండి’ అన్నా. ముగ్గురూ నన్ను వింతగా చూశారు. ‘ఇది కొత్తగా చెప్పాలా?’ అంది వసంత. ముగ్గురూ నా చేతిలో చేయేశారు.
నెలలు, ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ మా స్నేహంలో చిన్న కుదుపు లేదు. ఒకరి కష్టసుఖాల్లో ఒకరం తోడుగా నిలుస్తూనే ఉన్నాం. ఒకమ్మాయి మనసు గెల్చుకొని తనతో జీవితాంతం నడవాలంటే భర్త హోదాతోనే అది సాధ్యం అనుకునేవాణ్ని. ఆ అభిప్రాయం మార్చుకున్నా. ‘మీరు లవర్సా?, స్నేహితులా? అన్నాచెల్లెళ్లా?’ అనే ప్రశ్నలు మాకు ఎదురవుతూనే ఉన్నాయి. ఎవరెలా ఫీలైనా ఫర్వాలేదు. మాది స్వచ్ఛమైన స్నేహం. అందుకు ప్రతిరూపంగా ఉండాలనుకుంటున్నాం. ఉంటాం.

దెబ్బకు దెబ్బ.. సింధు ప్రతీకార విజయం కరోలినా చిత్తుచిత్తు బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ సెమీస్‌లో తెలుగు తేజం


దెబ్బకు దెబ్బ! రియో ఒలింపిక్స్‌ ఓటమికి ప్రతీకారం. ప్రపంచ ఛాంపియన్‌కు దిమ్మతిరిగే సమాధానం. ఆటలో.. మాటలో ప్రత్యర్థిని కవ్వించే కరోలినాకు తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు షాక్‌. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో ఒలింపిక్స్‌ ఛాంప్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)కు ఇంటిదారి చూపించిన సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
దుబాయ్‌ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి
న సింధు మెరిసింది. ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో సెమీస్‌కు అర్హత సాధించింది. శుక్రవారం హమ్‌దాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన గ్రూప్‌-బి చివరి పోరులో సింధు 21-17, 21-13తో మారిన్‌ను చిత్తుచేసింది. సెమీఫైనల్లో సింధు.. కొరియా క్రీడాకారిణి సంగ్‌ హ్యున్‌ను ఢీకొంటుంది. గురువారం సున్‌ యు (చైనా) చేతిలో పరాజయంతో సెమీస్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న సింధు.. తనపై 5-2తో మంచి రికార్డున్న మారిన్‌ను తెలివిగా ఓడించింది. పూర్తిగా దూకుడుగా ఆడకుండా.. ఎదురుదాడికి పోకుండా ప్రత్యర్థిని అంతుచిక్కని రీతిలో మట్టికరిపించింది. ఒలింపిక్స్‌ ఫైనల్లో చేసిన పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త పడింది. 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ ఆసక్తికరంగా జరిగింది. తొలి గేమ్‌లో శుభారంభం చేసిన మారిన్‌ చకాచకా పాయింట్లు రాబడుతూ 3-7తో ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. వెంటనే పుంజుకున్న సింధు వరుసగా 4 పాయింట్లు గెల్చుకుని స్కోరును సమం చేసింది. ఈ సమయంలో సింధు అసాధారణ రీతిలో దూకుడు కనబరిచింది. మారిన్‌ను కోర్టు నలువైపులా తిప్పుతూ పాయింట్లు రాబట్టింది. 11-10తో ఆధిక్యంలోకి వెళ్ళిన సింధు చూస్తుండగానే 16-12తో తొలి గేమ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. మారిన్‌ ఎదురుదాడికి దిగడంతో సింధు ర్యాలీ గేమ్‌ వైపు మళ్ళింది. సుదీర్ఘ ర్యాలీలు, నెట్‌ గేమ్‌ ఆడుతూ ప్రత్యర్థిని అసహనానికి గురిచేసిన సింధు 20-14తో తొలి గేమ్‌కు చేరువైంది. మారిన్‌ వరుసగా 3 పాయింట్లు సాధించినా.. వెంటనే పాయింటు రాబట్టిన సింధు 21-17తో తొలి గేమ్‌ను ముగించింది.
‘‘రియో ఒలింపిక్స్‌ తర్వాత మేమిద్దరం తలపడిన తొలి మ్యాచ్‌ ఇదే. ఒలింపిక్స్‌ ఫైనల్లో మారిన్‌ చేతిలో ఓటమి ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. వీలైనంత త్వరగా మారిన్‌తో మ్యాచ్‌ ఉండాలని కోరుకున్నా. ఇలాంటి పెద్ద టోర్నీలో మారిన్‌ను ఓడించడం గర్వంగా ఉంది. మారిన్‌ గొప్ప క్రీడాకారిణి. ఆమెపై విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’’
- ‘ఈనాడు’తో సింధు
రెండో గేమ్‌లో ఆటంతా సింధుదే. అన్ని రంగాల్లోనూ అద్భుతంగా ఆడిన సింధు ముందు మారిన్‌ తేలిపోయింది. ఆరంభంలో 1-3తో వెనుకబడినా.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సింధు దూసుకెళ్లింది. మారిన్‌ దూకుడుకు సింధు డిఫెన్స్‌తో అడ్డుకట్ట వేసింది. చూస్తుండగానే 11-6తో ఆధిక్యం సంపాదించిన సింధు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 15-10తో సింధు గేమ్‌పై పట్టుసాధించగానే మారిన్‌ ఆశలు వదులుకున్నట్లు కనిపించింది. అదే సమయంలో సింధు ఆటలో ఒక్కసారిగా వేగాన్ని పెంచి చకచకా పాయింట్లు రాబట్టింది. పదునైన స్మాష్‌లు, డ్రాప్‌ షాట్లతో పాయింట్లు గెల్చుకున్న సింధు 20-12తో గేమ్‌కు చేరువైంది. ఆ వెంటనే 21-13తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుని దెబ్బకు దెబ్బ తీసింది. ఈ మ్యాచ్‌లో మారిన్‌ గెలిచి ఉంటే సింధు కథ ముగిసేదే! గ్రూప్‌-బిలో సున్‌ యు మూడింట్లోనూ నెగ్గగా.. సింధు, యమగూచి ఒక్కో మ్యాచ్‌లో గెలిచారు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో మారిన్‌ నెగ్గి ఉంటే ఆమెకు సెమీస్‌ వెళ్లే అవకాశాలుండేవి. ఐతే మారిన్‌ ఆశలపై నీళ్ళు చల్లుతూ సింధు ఒలింపిక్స్‌ ఓటమికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. మారిన్‌పై విజయం సెమీస్‌ ముందు సింధు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. సెమీస్‌ ప్రత్యర్థి హ్యున్‌పై సింధుకు 6-3తో మెరుగైన గెలుపోటముల రికార్డుండటం విశేషం