స్నేహితుల వేడుక్కి.. శ్రేయతో పాడించా!
కోట్ల
రాబడి ఉన్న కార్పొరేట్ సంస్థ కార్యక్రమమైనా..కోటీశ్వరుల ఇంటి పిల్లల
పెళ్లైనా..కొండల్ని కరిగించే గాయకుల కచేరియైనా..ఏవీ వాళ్లకు వాళ్లే
చేయలేరు! ప్రజలకు తెలిసేట్టు ప్రకటనలు ఎలా ఇవ్వాలి.. ఆద్యంతం వాళ్లని
కట్టిపడేయాలంటే ఏం చేయాలి.. కార్యక్రమానికి వచ్చే అతిథులని ఎలా
గౌరవించాలి.. ఇవన్నీ వాళ్లు చూసుకోవాల్సిన అవసరంలేదు. ఆ బాధ్యతల్ని ఈవెంట్
మేనేజర్స్‌కి అప్పగిస్తే చాలు! మధిర హరిణి అలాంటి ఈవెంట్ మేనేజర్.
బాలీవుడ్ తారల నుంచి దేశంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థల నిర్వాహకుల దాకా తమ
కార్యక్రమాల ఏర్పాటుకి ఆమె సేవలకోసం ఎదురుచూస్తున్నారిప్పుడు!ఆ రంగంలో
అంతగా రాణిస్తున్న ఆమె తన విజయ యాత్రనిలా పంచుకున్నారుకార్యక్రమం నిర్వహించడం అంత సులువేం కాదు. మనదైన సృజన ఉండాలి. వినియోగదారుల ఆలోచనలూ, ఆసక్తులను దానికి మేళవించాలి. అందరినీ మెప్పించాలి. అప్పుడే ఆదరణ ఉంటుంది. అందుకే నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. అదే నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. జీఎమ్మార్, ఒరాకిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇన్ఫోసిస్ వంటి సంస్థలూ, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులెందరినో మా వినియోగదారులుగా మార్చింది. నేను పుట్టింది డెహ్రాడూన్ అయినా కావడానికి తెలుగువాళ్లమే. నాన్న ఓఎన్‌జీసీ ఉద్యోగి. నా చదువంతా దిల్లీలో సాగింది. నాన్నకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే నా చిన్నతనంలో ఇంట్లో తరచూ కచేరీలూ జరిగేవి. ఆ ప్రభావంతో నేనూ సంగీతంలో పీజీ చేశా. తరవాత నాకు ప్రఖ్యాత రికార్డింగ్ కంపెనీ ‘హెచ్‌ఎమ్‌వీ’లో పనిచేసే అవకాశం లభించింది. అక్కడ నా పని సంగీత కళాకారులతో ఆల్బమ్‌లు చేయడం. అక్కడయ్యాక మరో రెండు సంస్థల్లోనూ పనిచేశా. ఈలోగా పెళ్లవడంతో హైదరాబాద్ వచ్చేశా. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖవాళ్లు ఓ కార్యక్రమం కోసం సంగీతకళాకారుల్ని తీసుకొస్తారా అని అడిగారు. నేను అంతకముందు చేసిన పనే కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నా. కానీ అలాంటి సేవల్ని మళ్లీ కొనసాగించలేదు. మా వారి ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరిగి హైదరాబాద్ వచ్చాక నేనంటూ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. సంగీతాన్ని, పాటల్ని సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ‘‘సిస్నే ఫర్ ఆర్ట్స్’’ పేరుతో 2005లో ఈ సంస్థను ప్రారంభించా. నా పని ప్రముఖ గాయకుల్ని ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించడం. అలా ఇప్పటివరకూ జగ్జీత్ సింగ్, గుల్జార్, ఎల్.సుబ్రహ్మణ్యం, సోనూ నిగమ్, జాకిర్ హుసేన్, అంజాద్ అలీఖాన్, శ్రేయాఘోషల్ వంటి ప్రముఖులతో కార్యక్రమాలు చేశా. 2010లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రేయాఘోషల్‌తో ‘‘ఫ్రెండ్స్ ఫరెవర్’’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశా. అదే వేడుకను కైలాష్ ఖేర్‌తోనూ చేశా. జాకీర్ హుసేన్, మరో ఇద్దరు గ్రామీ అవార్డు విజేతలను ఇక్కడకు తీసుకొచ్చి కార్యక్రమాలు చేశా. సింగపూర్, యూకె, న్యూజిలాండ్ వంటి వివిధ దేశాల్లోనూ మా సంస్థ తరఫున ఏర్పాటు చేశా.
ఆడపిల్లవు నువ్వేం చేస్తావన్నారు..
కార్పొరేట్ సంస్థల కోసం ఉత్పత్తి ప్రదర్శనలు, వార్షికోత్సవాలు, థీమ్ వేడుకలను నిర్వహించడం మొదలుపెట్టా. కాకపోతే ఇది పూర్తిగా పురుషాధిక్యత ఉన్న రంగం. మొదట్లో ‘ఆడపిల్లవు నువ్వేం చేయగలవు’’ అన్నారు. అవకాశమిచ్చినా మా వల్ల పొరపాట్లు ఏవయినా జరిగితే వెంటనే గుర్తించి తిడదామని ఎదురు చూసేవారు. మగవాళ్లే ఓ పనిని బాగా చేస్తారని ఎక్కడా లేదు కదా.. అందుకే నేను వాళ్ల మాటల్ని సవాలుగా తీసుకున్నా. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. వందశాతం కష్టపడ్డా. మేం నిర్వహించే కార్యక్రమాలకు సమయమంటూ ఉండదు. అటు ఇంటినీ, పనినీ సమన్వయం చేసుకోవడం కూడా పెద్ద విషయమే. ఆ శ్రమే.. నాకు గుర్తింపు తెచ్చింది. మేం అందించే సేవల గురించి పెద్దగా ప్రచారం చేయకపోయినా కేవలం నోటిమాటద్వారానే అవకాశాలు వరుస కట్టాయి. కాగ్నిజెంట్, ఐబీఎమ్, జీఎమ్మాఎర్ వంటి అనేక సంస్థల్లో పలు రకాల కార్యక్రమాలు చేశా. ఇన్ఫోసిస్ సంస్థ మ్యాజిక్ ఇల్యూజన్ పేరుతో ఉద్యోగుల పిల్లలకోసం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. హ్యారీపోటర్, జిమ్మీ వంటి పాత్రలతో దాన్ని ఏర్పాటు చేశాం. అదే కాదు.. కాగ్నిజెంట్ సంస్థకోసం అరేబియన్ నైట్స్ థీమ్‌తో పాటూ, గోవా, బాలీవుడ్‌కెమెరా వంటి అనేక అంశాలతో కార్యక్రమాలూ రూపొందిస్తుంటా. ఇలాంటివాటికి తగినట్లుగా దుస్తులూ మేమే అందిస్తాం.
ఆగస్ట్ ఫెస్ట్ నిర్వహించా..
సందర్భం చెబితే చాలు దానికి సంబంధించి ఓ ప్రణాళిక రూపొందిస్తాం. ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి, ఎవరిని ఆహ్వానించాలి.. భోజనాలు, అతిథులు.. ఇలా అన్నింటి బాధ్యతా మాదే అవుతుంది. ఇప్పటివరకూ మేం చేసిన వాటిల్లో భారతదేశంలోనే అతిపెద్ద స్టార్టప్ మీట్ ఆగస్ట్‌ఫెస్ట్ చేయడం ఓ జ్ఞాపకం. బాలీవుడ్‌లో రాజీవ్‌గాంధీ సినీ అవార్డు కార్యక్రమాన్నీ మేం నిర్వహించాం. గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చిన్నారుల చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్ని అట్టహాసంగా చేసి చూపించా. హైదరాబాద్‌లో పర్యాటకశాఖకోసం తారామతి-బారాదరి, చౌమహల్లా వంటిచోట్లా పలువేడుకలు చేశా. 2017 కొత్త సంవత్సర వేడుకలకోసం ఫలక్‌నూమాలో కార్యక్రమం చేయబోతున్నాం. ఇవన్నీ చేయడం వెనుక మాకెంతో ఒత్తిడి ఉంటుంది. అన్ని విభాగాలనూ ఒక్కతాటిపై తీసుకురావాలి. ఏ మాత్రం తడబాటు పడినా అభాసుపాలవ్వాల్సిందే. ముఖ్యంగా వేలమంది హాజరయ్యే కార్యక్రమాల విషయంలో ఎన్నో అనుమతులూ తీసుకోవడం, ఆ జనాన్ని అదుపు చేయడం పెద్ద పనే. కొన్నిసార్లు కళాకారులు సమయానికి రారు. అలాంటప్పుడు ఆ నష్టాన్నీ నేనే భరించాలి. ఆ సందర్భాలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. అయినా ఎప్పుడూ భయపడింది లేదు. మేం చేసే కార్యక్రమం.. హాజరయ్యేవారి సంఖ్య, సంస్థ ఆలోచనల్ని బట్టి డబ్బు తీసుకుంటాం.
No comments:
Post a Comment