గొప్ప
రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత పార్లమెంటు
సమావేశాల తీరుపై తీవ్ర ఆవేదన చెందుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అన్నారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దీసా వద్ద జరిగిన రైతు సభలో ఆయన
మాట్లాడుతూ చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం నిరంతరం చెప్తోందన్నారు. కానీ తనను
లోక్‌సభలో మాట్లాడనివ్వడంలేదని మోదీ చెప్పారు. లోక్‌సభలో తనను
మాట్లాడనివ్వకపోవడం వల్లే తాను జన సభలో మాట్లాడుతున్నానని తెలిపారు.
మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పుట్టిన గడ్డపై నుంచి తాను
ప్రతిపక్ష మిత్రులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నానన్నారు. ఎన్నికల సమయంలో
వాడివేడి చర్చలు జరిగిన విషయం వాస్తవమేనని, మనమంతా ఎక్కువ మంది ఓటర్లు ఓటు
వేయాలని పిలుపునిచ్చామని చెప్పారు. అదేవిధంగా ప్రతిపక్ష సభ్యులు తనను
వ్యతిరేకించవచ్చునని, అయితే ప్రజలకు బ్యాంకింగ్ గురించి, సాంకేతిక
పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం గురించి వివరంగా
చెప్పాలని కోరారు. పేదల గురించి కేవలం మాట్లాడటానికి, వాళ్ళ కోసం పని
చేయడానికి చాలా తేడా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం పేదల కోసం పని
చేస్తోందన్నారు.
పార్లమెంటు
శీతాకాల సమావేశాలు నవంబరు 16న ప్రారంభమయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ
జరగాలంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు గట్టిగా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో
పార్లమెంటు కార్యకలాపాలు సజావుగా సాగడంలేదు. అర్ధాంతరంగా వాయిదా
పడుతున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందిస్తూ ఎంపీలను
ప్రజలు తమకు ప్రతినిధులుగా పార్లమెంటుకు పంపించారని, ఆ అవకాశాన్ని
పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఉపయోగించవద్దని సుతిమెత్తగా
హెచ్చరించారు.