cricket ad

Saturday 10 December 2016

వాళ్ళను బలోపేతం చేయడానికే నోట్ల రద్దు : ప్రధాని మోదీ

 పెద్ద నోట్ల రద్దు వల్ల విచారంగా ఎవరున్నారో, ఎవరు బలపడుతున్నారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివరించారు. అవినీతి వల్ల పేదలు, సామాన్యులు అనుభవిస్తున్న ఇబ్బందులను గుర్తు చేశారు. కరెన్సీ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో వివరించారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దీసా వద్ద అమూల్ పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. ‘అమూల్ దేశీ’ ఏ2 ఆవు పాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన రైతు సభలో మోదీ మాట్లాడారు.
 
ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద నోట్ల రద్దు గురించే మాట్లాడుకుంటున్నారని, పేదలను బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మోదీ చెప్పారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు వల్ల రూ.50, రూ.100 నోట్ల విలువ పెరిగిందన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులను, నకిలీ కరెన్సీ ముఠాలను బలహీనపరచగలిగామని పేర్కొన్నారు. అవినీతి వల్ల ఎవరు నిరుత్సాహపడుతున్నారని ప్రశ్నిస్తూ అవినీతికి పాల్పడుతున్నవాళ్ళకు విచారం లేదని, పేదలు, సామాన్యులే అవినీతి వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ‘నాకేం ఒరిగింది’ అని ఆలోచించని మనుషులున్న దేశంలో మనం ఉన్నామన్నారు. మన దేశం స్వార్థపూరితమైనది కాదన్నారు. మనమంతా మన భావి తరాల గురించి ఆలోచిస్తామన్నారు. పేదల గురించి మాట్లాడటానికి, వారికోసం పని చేయడానికి తేడా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని తెలిపారు. ‘‘50 రోజుల సమయం ఇవ్వమని అడిగాను. పరిస్థితులు ఎలా మారుతాయో మీరే చూస్తారు. అవినీతి నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఇది కీలకమైన ముందడుగు’’ అని మోదీ చెప్పారు.
 
‘‘నల్లధనం పోగేసుకున్న బ్యాంకు అధికారులు, ఇతరులు ఎలా అరెస్టవుతున్నారో చూడండి. దొడ్డిదారిన తప్పించుకోగలమని వాళ్ళు అనుకున్నారు, కానీ దొడ్డిదారిలో కూడా కెమెరాలను మోదీ అమర్చినట్లు వాళ్ళు తెలుసుకోలేదు’’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ఈ-బ్యాంకింగ్, ఈ-వాలెట్‌లను అలవాటు చేసుకుంటే ఏటీఎంలు, బ్యాంకుల వద్ద నిల్చుని సమయాన్ని వృథా చేసుకోవలసిన అవసరం ఉండదన్నారు. ఈ-వాలెట్లు బ్యాంకులను మీ మొబైల్స్‌లోకి తీసుకొచ్చాయన్నారు.

No comments:

Post a Comment