cricket ad

Wednesday 30 November 2016

ఇటువంటివి నమ్మవద్దు విక్స్ రాస్తే…పొట్ట తగ్గుతుందా?

ఇటువంటివి నమ్మవద్దు
విక్స్ రాస్తే…పొట్ట తగ్గుతుందా?
ఎలాంటి ఖర్చు, శ్రమ లేకుండా ఆయాచితంగా ఏదైనా లభిస్తుందంటే చాలు మనలో అధిక శాతం మందికి దానిపై ఆసక్తి కలుగుతుంది. అది వస్తువైనా, మరొకటైనా… ఏదైనా చాలు. దాన్ని సొంతం చేసుకోవాలనో, ఆ విషయంతో లాభం పొందాలనో చూస్తుంటారు. ఈ క్రమంలోనే మనలో ఉండే అలాంటి బలహీనతలను ఇతరులు క్యాష్ చేసుకుంటారు. తీరా చివరికి వచ్చేసరికి అలాంటి వార్తలన్నీ ఉత్త నాటకమే అని మనకు అర్థమవుతుంది. అయినా అవి అంతటితో ఆగవు. ఒకరి నుంచి మరొకరికి పుకార్ల రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. ప్రధానంగా నేటి ఆధునిక యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి పుకారు వార్తలు వ్యాపించడానికి ఎక్కువ సమయం కూడా పట్టడం లేదు. ఒకరు అలాంటి న్యూస్‌ను తమ టైం లైన్‌లో ఇతరులకు షేర్ చేస్తే అది కాస్తా వైరల్‌గా మారి కొన్ని క్షణాల్లోనే కొన్ని లక్షల మంది యూజర్లకు చేరుతోంది. అయితే ఇలాంటి వార్తల వల్ల మనకు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాటిని సృష్టించిన, కావాలని వ్యాప్తి చెందిస్తున్న వారికి మాత్రమే వాటి ద్వారా ప్రయోజనం కలుగుతుంది. విక్స్ కంపెనీ తెలుసుగా. దానికి చెందిన విక్స్ వాపోరబ్ గురించిన పుకారు ప్రచారం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.
అది ఎవరు సృష్టించారో, ఎవరు వ్యాప్తి చేయిస్తున్నారో తెలియదు కానీ విక్స్ వాపోరబ్‌ను పొట్టపై రాస్తే అక్కడ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందనే ఓ పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. దాదాపు అనేక వెబ్‌సైట్లు ఈ న్యూస్‌ను తమ వార్తలలో ఫీచర్డ్‌గా పబ్లిష్ చేసి దాని ద్వారా అంతో ఇంతో పేజ్‌వ్యూస్, క్లిక్స్‌తో లాభం పొందుతున్నాయి. దీనికి తోడు విక్స్ కంపెనీకి కూడా రెండు విధాలుగా లాభం కలుగుతోంది. ఒకటి ప్రచారం రూపంలో. మరొకటి ఆ ఉత్పత్తి అమ్మకాల ద్వారా. పుకారు మాట ఏమో గానీ ఇప్పుడు అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే విక్స్ వాపోరబ్ రాస్తే నిజంగానే పొట్ట తగ్గుతుందా? తెలుసుకుందాం.
విక్స్ వాపోరబ్‌లో ఉన్న పదార్థాలను ఒక సారి పరిశీలిస్తే అందులో లెవో మెంథాల్, కాంఫర్ (కర్పూరం), యూకలిప్టస్ ఆయిల్, టర్పంటైన్ ఆయిల్‌లు ప్రధానంగా ఉన్నాయి. లెవో మెంథాల్ డీకంజెస్టెంట్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంటే శ్వాస నాళంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుంది. అదేవిధంగా కర్పూరం దగ్గును తగ్గించేందుకు, యూకలిప్టస్ ఆయిల్, టర్పంటైర్ ఆయిల్‌లు శ్వాసకోశ సమస్యలైన జలుబు, ముక్కు దిబ్బడలను తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో అవి స్వతహాగా ఘాటైన వాసనలను, వేడి ధర్మాలను కలిగి ఉండడం చేత ఆయా అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంది. అంతేకానీ పైన తెలిపిన పదార్థాలు ఏవిధంగానూ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడవు.
ఇంకో విషయం ఏమిటంటే విక్స్ వాపోరబ్‌ను రాసిన తరువాత ఆ ప్రదేశాన్ని గాలికి అలాగే వదిలేయాలి. దానిపై ఎలాంటి క్లాత్‌ను గానీ, ఇతర ఏ బ్యాండేజ్‌ను గానీ కట్టకూడదు. దీని వల్ల చర్మం ఇర్రిటేషన్‌కు గురవుతుంది. కానీ పుకారు వార్తల్లో చెబుతున్నది ఏమిటంటే పొట్టపై విక్స్‌ను రాసి దానిపై బిగుతుగా ఏదైనా క్లాత్‌ను గానీ, ప్లాస్టిక్ కవర్‌ను గానీ కట్టమని చెబుతున్నారు. అందులో ఇసుమంతైనా సత్యం ఉందా? ఇది అంతకు ముందు చెప్పిన దానికి ఎంత విరుద్ధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. సో, ఇకనైనా పుకారు వార్తలని నమ్మకండి. కష్టపడందే ఏదీ మన దగ్గరికి రాదనే విషయాన్ని మరోమారు గుర్తుంచుకోండి. అయినా పొట్ట తగ్గాలంటే సహజ సిద్ధమైన పద్ధతిలో వ్యాయామం చేయడం, కచ్చితమైన ఆహార నియమాలను పాటిస్తే చాలు. ఇలాంటి వదంతులను నమ్మి లేని, పోని అనారోగ్య సమస్యలను తెచ్చుకోకండి.

No comments:

Post a Comment