నల్ల ధనాన్ని పూర్తిగా నిర్ములించడానికి నగదు రహిత భారతదేశమని భావిస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్రస్తుతం కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్లను కూడా వచ్చే జూన్ లో రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నిజానికి పెద్ద నోట్ల రద్దుకు.. రూ.2వేల నోటుకు ఎటువంటి సంబంధం లేదని.. రూ.2వేల నోట్లు ప్రవేశపెట్టాలని ఎప్పుడో తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రూ.500 నోటు కంటే ముందే మార్కెట్లోకి రూ.2 వేల నోటు ముంచెత్తడానికి ఇదే కారణమని.. 4 ప్రింటింగ్ ప్రెస్‌లు ఉంటే ఒక్కదాంట్లోనే రూ.2 వేల నోట్లను ప్రింట్ చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
నగదు రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే.. రూ.500 నోట్లను పరిమితంగా ముద్రిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ధ్వారా తెలుస్తుంది. ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత నల్లకుబేరులు తమ వద్ద ఉన్న సొమ్మును.. రూ.2 వేల నోట్ల రూపంలో మార్చుకున్నారు. వచ్చే జూన్‌లో మళ్లీ ప్రభుత్వం రూ.2 వేల నోటును రద్దు చేస్తే.. నల్లకుబేరులు మళ్లీ రూ.500 నోట్లలోకి మార్చేసుకుంటారు. ఇలా చేసుకుంటూ పోతే నల్లధనం ఎప్పటికీ బయటకు రాదనే ఉద్దేశంతో.. ప్రభుత్వం పక్కా వ్యూహంతోనే రూ.500 నోట్లను ముద్రిస్తున్నట్లు తెలుస్తుంది. రూ.2 వేల నోటును రద్దు చేసిన తర్వాతే పూర్తిస్థాయిలో రూ.500 నోటను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా ఇప్పుడు ఉన్న నోట్ల కొరతను తీర్చాలంటే మార్కెట్లోకి ఏకంగా రూ.8.3 లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం 1660 కోట్ల నోట్లను ముద్రించాల్సి ఉండగా.. రూ.500 నోట్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. జూన్‌లో రూ.2వేల నోటును రద్దు చేసే నాటికి రూ.500 నోట్ల ముద్రణ పూర్తి అవుతుంది. అలానే.. రూ.1000 నోట్లును తిరిగి తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని కూడా సమాచారం. దీనిని బట్టి చూస్తే ప్రజలు ప్రస్తుతం పడుతున్న కష్టాలు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉంది.
దీనితో ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు డిజిటల్ లావాదేవీలకు వెళ్లాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుంది. అలానే ప్రజలు కూడా గత్యంతరం లేక జనవరి నుంచి ఇదే విధానం అవలంబించే అవకాశం కూడా ఉంది. ఇలా జూన్ నాటికి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించే ప్రక్రియను పూర్తిచేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.
No comments:
Post a Comment