cricket ad

Friday 16 December 2016

ఇంగ్లాండ్‌ నిలిచింది తొలిరోజు 284/4 అలీ అజేయ శతకం రాణించిన రూట్‌ భారత్‌తో ఐదో టెస్టు


చెపాక్‌లో తొలి రోజు ఇంగ్లాండ్‌దే. కనీసం ఒక్క విజయంతోనైనా వూరట పొందాలనుకుంటున్న ఇంగ్లాండ్‌.. భారత్‌తో చివరిదైన ఐదో టెస్టును బలంగా ఆరంభించింది. ఆల్‌రౌండర్‌ మెయిన్‌ అలీ చక్కని శతకం సాధించిన వేళ.. కుక్‌సేన మెరుగైన స్థితిలో నిలిచింది.
చెన్నై
టెస్టు సిరీస్‌ గెలిచిన వూపులో రెట్టించిన విశ్వాసంతో చివరిటెస్టులో బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు ప్రతిఘటన ఎదురవుతోంది. తొలి రోజు ఇంగ్లాండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొయిన్‌ అలీ (120 బ్యాటింగ్‌; 222 బంతుల్లో 12×4) అజేయ శతకానికి జో రూట్‌ (88; 144 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ తోడు కావడంతో మొదటి రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 284 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (49; 90 బంతుల్లో 3×6) రాణించాడు. అలీతో పాటు స్టోక్స్‌ (5) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు మందకొడి పిచ్‌పై స్లోటర్న్‌ మాత్రమే లభించింది. అదనపు పేస్‌ వల్ల జడేజా మూడు వికెట్లు పడగొట్టగలిగాడు. మిగతా ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్‌, మిశ్రాలకు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. ఆరంభంలో మనోళ్లే..: చెపాక్‌లో టాస్‌ గెలవగానే ఇంగ్లాండ్‌ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే 21 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా ఆరంభంలో భారతే పైచేయి సాధించింది. జెన్నింగ్స్‌ను ఇషాంత్‌ ఔట్‌ చేయగా... కుక్‌ను జడేజా వెనక్కి పంపాడు.
ఆదుకున్న అలీ, రూట్‌: తొలి రోజు ఇంగ్లాండ్‌ను మెరుగైన స్థితిలో నిలిపిన ఘనత నిస్సందేహంగా మొయిన్‌ అలీదే. పట్టుదలతో ఆడిన అతడు ఆ జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. లేదంటే 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ చిక్కుల్లో పడేదే. సాధికారికంగా ఆడిన అలీ.. రూట్‌తో మూడో వికెట్‌కు 146 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. ఆ తర్వాత బెయిర్‌స్టోతో నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ను ఇంకా బలమైన స్థితికి తీసుకెళ్లాడు. ఐతే అలీ కూడా తన ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఇబ్బందిపడ్డాడు. లంచ్‌కు ముందు అశ్విన్‌ బౌలింగ్‌లో తడబడ్డాడు. లంచ్‌కు ముందు 44 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 7 పరుగులే చేశాడు. ఐతే క్రీజులో నిలదొక్కుకున్నాక ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అశ్విన్‌, జడేజా బౌలింగ్‌ల్లో స్వీప్‌లతో బౌండరీలు రాబట్టాడు. మరోవైపు రూట్‌ కూడా నియంత్రణతో ఆడడంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోయింది. లంచ్‌ తర్వాతి సెషనల్లో ఆ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అలీ మిశ్రా బౌలింగ్‌లోనూ ధాటిగా ఆడాడు. 51వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిశ్రా బౌలింగ్‌లో అతడు ఆడిన బ్యాక్‌స్వీప్‌ (బ్యాటు వెనుక భాగంతో) ఆకట్టుకుంది. రూట్‌ కూడా మంచి నైపుణ్యంతో స్వీప్‌ చేశాడు. స్వీప్‌, స్లాగ్‌ స్వీప్‌లతో మొత్తంగా అతడు ఐదు బౌండరీలు సాధించాడు. ఇతర షాట్లతోనూ అలరించాడు. అదే క్రమంలో భారత్‌పై 11వ అర్ధశతకం (11 మ్యాచ్‌ల్లో) సాధించాడు. ఐతే టీకి అరగంట ముందు రూట్‌ను జడేజా ఔట్‌ చేశాడు. భారత బౌలర్లను సమర్థంగా స్వీప్‌ చేసిన రూట్‌ చివరికి స్వీప్‌కే క్యాచ్‌ ఔటయ్యాడు. భారత అప్పీలును అంపైర్‌ తిరస్కరించినా.. అతడు సమీక్షలో ఔట్‌గా తేలాడు. రూట్‌ నిష్క్రమణతో భారత్‌ మళ్లీ పోటీలోకి వస్తుందనిపించింది. కానీ అలీ, బెయిర్‌స్టోలు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. చివరి సెషన్‌ను ధాటిగా ఆరంభించారు. బెయిర్‌స్టో ఏమాత్రం అవకాశం దక్కినా స్పిన్నర్ల బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌లు చేశాడు. వరుసగా జడేజా, అశ్విన్‌ ఓవర్లలో సిక్సర్లు కొట్టాడు. ఐతే బెయిర్‌స్టో అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో నిష్క్రమించాడు. 81వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లో అతడు రాహుల్‌కు తేలికైన క్యాచ్‌ ఇచ్చాడు. మరోవైపు అలీ చక్కని ఆటను కొనసాగించాడు. మిశ్రా బౌలింగ్‌లో ముందుకొచ్చి కవర్స్‌లో బౌండరీతో 99కి చేరుకున్న అతడు.. వెంటనే సింగిల్‌తో టెస్టుల్లో ఐదో శతకం పూర్తి చేసుకున్నాడు.
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: కుక్‌ (సి) కోహ్లి (బి) జడేజా 10; జెన్నింగ్స్‌ (సి) పార్థివ్‌ (బి) ఇషాంత్‌ 1; రూట్‌ (సి) పార్థివ్‌ (బి) జడేజా 88; అలీ బ్యాటింగ్‌ 120; బెయిర్‌స్టో (సి) రాహుల్‌ (బి) జడేజా 49; స్టోక్స్‌ బ్యాటింగ్‌ 5; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 284;
వికెట్ల పతనం: 1-7, 2-21, 3-167, 4-253
బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 12-1-44-0; ఇషాంత్‌ శర్మ 12-5-25-1; జడేజా 28-3-73-3; అశ్విన్‌ 24-1-76-0; అమిత్‌ మిశ్రా 13-1-52-0; కరుణ్‌ నాయర్‌ 1-0-4-0.

No comments:

Post a Comment