cricket ad

Thursday 15 December 2016

పెళ్లిరోజున కట్టుకోవాల్సిన చీరలు..పెట్టుకోవాల్సిన నగలూ.. ఇతర అలంకరణ గురించే కదా! ఏ నవ వధువైనా ఆలోచించేది. కానీ శ్రీమంతుల ఇంట్లో పుట్టి.. మరో సంపన్నుల ఇంటికి కోడలుగా వెళ్లిన శ్రేయా మునోత్‌ మాత్రం.. తన పెళ్లి సందర్భంగా పేదలకు ఎలా సాయ పడగలనా అని ఆలోచించింది.. చివరకు 90 పక్కా ఇళ్లు కట్టించి.. వాళ్ల మధ్య ఆనందంగా మనువాడింది. అందుకే ఆమె గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు



కొన్ని నెలల క్రితం వరకూ.. శ్రేయ తన పెళ్లి ­రంతా తెలిసేలా జరగాలనీ, ఖరీదైన బట్టలూ, నగలు వేసుకోవాలనీ, వందల రకాల వంటకాలు వడ్డించాలని ఆలోచించింది. కానీ ఉన్నట్టుండి ఆమె తన ఆలోచన మార్చుకుంది. అది ఎందుకో చెప్పేముందు.. శ్రేయ ఎవరో చూద్దాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ తాలూకా లాసూర్‌ స్టేషన్‌ ఆమె స్వగ్రామం. తండ్రి అజయ్‌ మునోత్‌ జైన్‌ వ్యాపారి. గ్రామంలోనే ధనిక కుటుంబం వాళ్లది. బాగా చదివి తానూ వ్యాపారంలో స్థిరపడాలనే ఆలోచనలతో ఎంబీఏ పూర్తి చేసింది శ్రేయ. వెంటనే ఓ ప్రయివేట్‌ సంస్థ మానవ వనరుల విభాగంలో మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది.
ఆ మాటలే కారణం..
ఆరునెలల క్రితమే శ్రేయ అందం, గుణం నచ్చి ఓ సంబంధం వచ్చింది. ఔరంగాబాద్‌కి చెందిన బాదల్‌ జైన్‌ శ్రేయకూ నచ్చడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాదల్‌జైన్‌ది కూడా వ్యాపార కుటుంబమే. తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వాళ్లది. అందుకే పెళ్లి అత్యంత ఆర్భాటంగా చేయాలని పెద్దలు అనుకున్నారు. ఏడు నక్షత్రాల హోటల్‌లో ఘనంగా వివాహం జరపాలని ముందుగానే రుసుము కూడా చెల్లించారు. శ్రేయ కూడా ఆమె పెళ్లి గురించి ఎన్నో ­హించుకుని ఉద్యోగానికీ రాజీనామా చేసింది. మరోవైపు శుభలేఖలు ఎంత గొప్పగా వేయించాలీ, అతిథులకు ఎలాంటి కానుకలు ఇవ్వాలీ... వంటి చర్చలు ఇంట్లో ప్రతిరోజూ జరిగేవి. ఆ సమయంలో ఓ రోజు శ్రేయ కుటుంబానికి అత్యంత వాళ్లకు సన్నిహితుడైన గంగాపూర్‌ శాసనసభ్యుడు ప్రశాంత్‌ బంబు వాళ్లింటికి వచ్చాడు. ఇంట్లో పెళ్లి హడావుడి చూసి..‘ఇన్ని ఆర్భాటాలు అవసరమా. సాదాసీదాగా పెళ్లి జరిపి మిగిలిన డబ్బుతో పేదలకోసం ఏదైనా చేయొచ్చుగా’ అని మాటవరసకు అన్నాడు. ఆ మాటలకు మొదట శ్రేయ నొచ్చుకుంది.


కళ్లారా చూశాక..
మర్నాడు గ్రామంలోని పేదల ప్రాంతానికి వెళ్లి.. వారి పరిస్థితిని దగ్గరగా చూసింది. అక్కడివారు నిలువ నీడలేక రోడ్డుపక్కన గుడారాల్లో ఉండటం, చిన్నారులు మురికి దుస్తులతో మట్టిలో ఆడుకోవడం, అనారోగ్యాల బారినపడటం చూసి బాధపడింది. అప్పుడే శ్రేయ తన పెళ్లికి చేసే ఖర్చు వృథా కాకూడదని అనుకుంది. తల్లిదండ్రులతో అదే మాట చెబితే వారూ సంతోషించారు. కానీ వియ్యాలవారు ఏమంటారోనని భయపడ్డారు. శ్రేయ చివరకు కాబోయే భర్త బాదల్‌ జైన్‌కు తన మనసులో మాట చెప్పింది. ‘మేము నీకు అండగా ఉంటాం’ అంటూ అత్తింటివారు ముందుకొచ్చారు. మొదట శ్రేయ ఏం చేయాలా అని బాగా ఆలోచించింది. అన్నం, దుస్తుల వంటివి అందిస్తే తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. అలా కాకుండా తన పెళ్లి కానుకగా పేదవాళ్లకు ఏదైనా ఘనంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని అనుకుంది. వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇస్తే.. వాళ్లకో ఆశ్రయం ఉంటుందని అనుకుంది. అది మిగిలిన కుటుంబసభ్యులకూ నచ్చడంతో ఎంత ఖర్చైనా భరిద్దామని ఆమె తల్లీతండ్రీ, అత్తమామలు భరోసానిచ్చారు.
108 ఇళ్లు కట్టించాలని..
శ్రేయ ఎలాంటి వారికి ఇల్లు ఇవ్వాలని బాగా ఆలోచించింది. అందరి పరిస్థితి గమనించి సెంటు భూమి, ఇల్లు లేకుండా, దురలవాట్ల జోలికి వెళ్లకుండా ఉండేవారికీ, పిల్లలున్న వితంతులకు ఇళ్లు కట్టించాలని నిర్ణయించుకుంది. ప్రశాంత్‌ సాయంతో తమ గ్రామానికి దగ్గర్లో ఉన్న ఆహర్‌నగర్‌ పరిసరాల్లో అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్న 108 మంది కుటుంబాలకు శాశ్వత పక్కా నివాసాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. వారికోసం స్వగ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరాపూర్‌లో రెండున్నర ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. శ్రేయ నానమ్మా, తాతయ్య కళావతి నోమిచంద్‌ల పేర్లతో కళానోమి నగర్‌ అని ఆ ప్రాంతానికి పేరు పెట్టింది. అలా గత అక్టోబర్‌ 2న శ్రేయ ఆ గృహ సముదాయానికి భూమి పూజ చేసింది. ఒక్కో లబ్ధిదారుకు మూడొందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పడకగది ఉన్న ఇల్లు ఇచ్చేలా ప్రణాళిక వేసుకుంది. డిసెంబరు 12న శ్రేయ వివాహం సందర్భంగా నూట ఎనిమిది కుటుంబాలకు ఇంటి తాళాలను అప్పగించాలనుకుంది. కానీ అప్పటికి కేవలం తొంభై మాత్రమే సకల సౌకర్యాలతో పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయ్యాయి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. ఇందుకోసం కోటిన్నర రూపాయలు ఖర్చు చేసింది శ్రేయ. విద్యుత్‌, స్వచ్ఛమైన తాగునీరు, పక్కా మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసింది. త్వరగా ఆసుపత్రి, అంగన్‌వాడీ, ఇతర దుకాణ సముదాయాలూ నిర్మించే ప్రయత్నంలోనూ ఉంది.
పెళ్లి సాదాసీదాగా..
ఆమె వివాహ సమయం రానే వచ్చింది. ఏడు నక్షత్రాల హోటల్‌లో కాకుండా ఆమె కట్టించిన ఇచ్చిన గృహసముదాయాల మధ్యలోనే పెళ్లి చేసుకుంది. వివాహతంతు ముగియగానే అదే వేదిక మీద శ్రేయ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసింది. ‘నావల్ల కొందరికైనా మేలు జరుగుతుందనే సంతృప్తి నాకుంది. ఈ స్ఫూర్తి, ఆనందంతో భవిష్యత్‌లో మరికొంత మందికి సాయపడాలనుకుంటున్నా..’ అంటుంది శ్రేయ ఆనందంగా.


No comments:

Post a Comment