cricket ad

Friday 16 December 2016

గౌతమిపుత్ర... నా పూర్వజన్మ సుకృతం - ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో బాలకృష్ణ

‘మనకంటూ ఓ దేశాన్ని... ఒక చరిత్రని... ఒక వారసత్వాన్ని... గౌరవాన్ని తెచ్చిపెట్టిన శక పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి వీరగాథలో నటించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. శ్రియ కథానాయిక. హేమమాలిని ముఖ్యభూమిక పోషించారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. బెబో శ్రీనివాస్‌ సమర్పిస్తున్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్ర నైజాం ప్రాంత పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘శాతవాహనుల సింహ ద్వారం కోటిలింగాల. శాతకర్ణి తల్లి గౌతమి పుట్టింది ఇక్కడే. ఈ గడ్డపై మా సినిమా ప్రచార చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉంది. ఎలాంటి కథలో నటించాలా అని వందో చిత్రం గురించి సతమతమవుతున్న సమయంలో దర్శకుడు క్రిష్‌ నాకు ఈ కథ చెప్పారు. శాతకర్ణికి సంబంధించిన చరిత్ర కూడా మన దగ్గర లేదు. గుంటూరుకు చెందిన పరబ్రహ్మశాస్త్రిగారు పరిశోధన చేసి శాతవాహనులు తెలుగువాళ్లని నిరూపించారు. ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆ చరిత్ర నేపథ్యంలోనే క్రిష్‌ ఓ మంచి కథని సిద్ధం చేసుకొని నన్ను కలిశారు. సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక... ఇలా అన్ని రకాల చిత్రాల్లోనూ నేను నటించా. నా దృష్టిలో మూడే శకాలు. ఒకటి శాలివాహన శకం, మరొకటి స్వాతంత్రోద్యమం, మరొకటి ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావడం. జంబు ద్వీప కాలమాన పట్టిక ప్రకారం శాతకర్ణి సింహాసనం అధిష్ఠించినరోజే ఉగాది పండుగని చేసుకొంటున్నాం. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా శాతకర్ణిని తలచుకొని ఆ పండుగని జరుపుకొంటారు. ఇలా చరిత్రను చాటిచెప్పే చిత్రాలెన్నో అప్పట్లో నాన్నగారు ఎన్టీఆర్‌ చేశారు. అలాంటి ఓ మహానటుడికి వారసుడిగా నా కర్తవ్యంగా భావించే ఈ సినిమా చేశా. శాతకర్ణి, గాంధీజీ, ఆదిశంకరాచార్యులు, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌లాంటి యుగ పురుషులకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. పుట్టిన వూరు, ప్రాంతం, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి జన్మకి సార్థం చేకూర్చుకున్నారు. నేను నాన్నగారి అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. సాయిమాధవ్‌ అద్భుతమైన సంభాషణలు రాశారు. నిజానికి ఇంతటి చారిత్రక కథాంశాన్ని చిత్రీకరించాలంటే రెండేళ్లు పడుతుంది. కానీ మంచి సంకల్ప బలంతో మొదలెట్టిన ఈ చిత్రానికి ఎక్కడా చిన్న ఆటంకం కూడా ఎదురు కాలేదు. ప్రకృతి కూడా మా సినిమా చిత్రీకరణకు సహకరించింది’’ అన్నారు. అనంతరం చిత్రంలోని సంభాషణలు చెప్పి సభికుల్ని అలరించారు బాలకృష్ణ. దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ శౌర్యం, యుద్ధ విన్యాసాలతో సింహం బిరుదును సార్థకం చేసుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి రెండు వేల సంవత్సరాల క్రితం శత్రు దేశాలకు సింహస్వప్నం అయితే, ఈ సినిమాకు నిజమైన సింహం బాలకృష్ణ’’ అన్నారు. చిత్ర మాటల రచయిత సాయిమాధవ్‌ మాట్లాడుతూ ఈ సినిమాకు మాటలు రాయడమంటే వంద సినిమాలకు రాస్తున్నట్లుగా భావించి పనిచేశానన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల తెదేపా అధ్యక్షులు విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, బిబో శ్రీనివాస్‌, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
-న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం
ప్రత్యేక పూజలు...: గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ ఆవిష్కరణను పురస్కరించుకొని శుక్రవారం ఆయన శాతవాహనుల తొలి రాజధాని అయిన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలను సందర్శించారు. చిత్ర బృందంతో కలిసి కోటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో బాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. కోటేశ్వరస్వామి కొలువైన గడ్డపై పుట్టిన గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశాన్ని ఐక్యం చేసి విదేశీయుల మీద దండయాత్ర చేశారన్నారు. ఆయన వెంట దర్శకులు క్రిష్‌, రచయిత సాయిమాధవ్‌ తదితర చిత్ర బృందం ఉన్నారు.
- న్యూస్‌టుడే, వెల్గటూరు

దేశం మీసం తిప్పుదాం
బాలకృష్ణ ఏం చేసినా ముహూర్తం ప్రకారమే చేస్తారు. తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌ని కూడా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం శుక్రవారం సాయంత్రం సరిగ్గా 5 గంటల 38 నిమిషాలకి విడుదల చేయించారు. 2 నిమిషాల 20 సెకన్ల నిడివి వున్న ట్రైలర్‌లో దృశ్యాలు, బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విడుదలవ్వడమే ఆలస్యం... అంతర్జాలంలో హంగామా సృష్టించింది ట్రైలర్‌. తెలుగు చిత్రసీమకి చెందిన ప్రముఖులు, అభిమానులు బాలకృష్ణ సినిమా ట్రైలర్‌ గురించే మాట్లాడుకోవడం విశేషం. ‘మా జైత్రయాత్రని గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి... మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా... శరణమా, మరణమా!’ అంటూ బాలకృష్ణ చెప్పే సంభాషణతో ట్రైలర్‌ మొదలవుతుంది. ‘ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకొందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశి నెత్తుటితో ప్రక్షాళన చేసేద్దాం. దొరికినవాణ్ని తురుముదాం, దొరకనివాణ్ని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం’ అనే సంభాషణలతో పూర్తవుతుంది. ‘ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్లారు, ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళుతున్నారు. మీరు మనిషేనా’ అంటూ వశిష్టదేవిగా శ్రియ, ‘ఈ ముప్పది మూడు కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి’ అంటూ గౌతమి పాత్రధారి హేమామాలిని చెప్పే సంభాషణలు ప్రచార చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి. ‘మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని... మహాయుద్ధాన్ని’ అనే సంభాషణ కూడా ఆకట్టుకొంటోంది. ట్రైలర్‌ని చూసిన వెంటనే ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ తదితరులు ట్విట్టర్‌ ద్వారా చిత్రబృందాన్ని అభినందించారు.

No comments:

Post a Comment