యంత్రాంగమంతా మంత్రాంగం దెబ్బకు మౌనం వహించింది. తొలుత గుడ్లురిమిన చట్టం ఆ తరువాత గుర్రుపెట్టి నిద్రపోయింది. సర్కార్‌కు దక్కాల్సిన రూ.44 కోట్ల విలువైన స్థలంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి పక్కాగా పైకి లేచింది. వారసులు లేని వ్యక్తుల ఆస్తులు వారి తదనంతరం ప్రభుత్వానికే దక్కుతాయి. బోనా వేకెన్షియా చట్టం ఇదే చెబుతోంది. ఒకవేళ ఎవరైనా మేమే వారసులమని ముందుకొస్తే రెవన్యూ యంత్రాంగం విచారణ జరుపుతుంది. తగిన ఆధారాలు చూపించి వారసులుగా నిరూపించుకుంటేనే ఆస్తి వారిసొంతం అవుతుంది. కానీ హైదరాబాద్ నడిబొడ్డున గజం లక్షకు పైగా విలువ చేసే ఎకరాకు పైగా దిక్కులేని స్థలాన్ని అడ్డగోలుగా కొట్టేశారు. ఈ స్థలం ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు పీకేసేని బోర్డును పీకేసి మరీ చెరబట్టారు.
కాచిగూడ స్టేషన్ రోడ్డులో టౌన్ సర్వే నెంబర్ 29, బ్లాక్-జే వార్డు నెం.190లో 4500 గజాల వివాదాస్పద స్థలం ఉంది. సుమారు రూ.44 కోట్ల విలువైన ఈ స్థలం సుమిత్రాబాయి అనే మహిళకు చెందింది. అయితే ఆమెకు వారసులెవరూ లేరు. దాంతో ఆమె మరణానంతరం కొందరు కబ్జాదారులు రంగంలోకి దిగారు. సుమిత్రాబాయి భర్త తాలూకు మనుషులం, మేమే వారసులం అంటూ తెరపైకి వచ్చారు. సదరు భూమిలో నిర్మాణాలు మొదలుపెట్టారు. స్థానికుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమగ్ర విచారణ అనంతరం 2008 మార్చి 13వ తేదీన బోనావేకెన్షియా యాక్ట్-1974, సెక్షన్ 7, 8 ప్రకారం ఈ స్థలం అంతా ప్రభుత్వానిదేనని అధికారులు నిర్థారించారు. ఆ వెనువెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పలు విజ్ఞప్తులు, విచారణల నేపథ్యంలో వారసులు మీరే అనే పత్రాలు సమర్పించండని 2011 ఏప్రిల్ 27న జిల్లా కలెక్టర్ సంబంధిత వ్యక్తులకు సమన్లు జారీచేశారు. సరైన డాక్యూమెంట్లు లేకపోవడంతో కబ్జాదారులు ముఖం చాటేశారు. కలెక్టర్ ముందుకు వెళ్లకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం విచారణ జరిపిన అధికారులు స్థలం ప్రభుత్వానికే చెందుతుందని నిర్థారించారు. దీన్ని క్లేయిమ్ చేస్తున్నవారికి 2014 జూన్ 18న మరోసారి సమన్లు జారీచేశారు. ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాలని స్పష్టం చేశారు. అయితే పత్రాలు సమర్పించకపోవడంతో స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది ప్రభుత్వ స్థలమంటూ అక్కడ బోర్డు కూడా పెట్టింది. నిర్మాణ అనుమతులు నిలిపివేయాలని జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాసింది. అనుమతి లేకుండా కడుతున్న నిర్మాణాలను కూల్చివేయాలని కూడా కోరింది.
విలువైన స్థలం చేజారిపోవడంతో కబ్జాదారులు ఖంగుతిన్నారు. అప్పటికీ తమ ప్రయత్నాలను విడిచిపెట్టకుండా బడా లాబీని ఆశ్రయించారు. నగరం నడిమధ్యలో స్థలం ఉండటం, పక్కనే కాచిగూడా రైల్వే స్టేషన్ ఉండటం. దిక్కులేని భూమిలో కట్టిన నిర్మాణం అంతా ఆస్పత్రిఅవసరాలకు సరిపోయేలా ఉండటంతో రాజకీయంగా పరపతి కలిగిన ఓ ఆస్పత్రి యాజమాన్యం రంగంలోకి దిగింది. వీరికి ఓ మంత్రి సహకారం అందించారు. కబ్జాదారుల నుంచి ఈ స్థలాన్ని సదరు ఆస్పత్రి యాజమాన్యం సొంతం చేసుకుంది. ఆ తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. స్థలం ప్రభుత్వానిదే అంటూ అప్పటిదాకా పరుగులు పెట్టిన ఫైళ్ల కాళ్లు చచ్చుబడ్డాయి. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు నిలిపివేయాలి అని జీహెచ్ఎంసీకి జిల్లా యంత్రాంగం లేఖ రాసినా బల్దియా అటువైపు కన్నెత్తి చూడలేదు. స్థానికులు, రెవెన్యూ యంత్రాంగం అభ్యంతరాలన్నీ బుట్టదాఖలయ్యాయి. ఆస్పత్రి నిర్మాణం దర్జాగా పూర్తైంది. ఈ ఏడాది అక్టోబర్ మొదటివారంలో కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ తదితర బాలీవుడ్ తారలు ప్రముఖ రాజకీయ నేతల సమక్షంలో అట్టహాసంగా ఆస్పత్రి ప్రారంభోత్సవం జరిగింది.
No comments:
Post a Comment