cricket ad

Tuesday, 13 December 2016

కోట్ల కొద్దీ కొత్త నోట్లు

  • సుప్రీం లాయర్‌ ఇంట్లో 14 కోట్లు
  • ఐటీ దాడుల్లో 33 కోట్ల ఆస్తులు లభ్యం
  • స్వచ్ఛంద వెల్లడి రూ.125 కోట్లు
  • 100 కోట్లతో ఇటీవలే కొడుకు పెళ్లి
  • గత ఏడాదే వంద కోట్ల ఇల్లు కొనుగోలు
  • అగస్టా నిందితులతో సంబంధాలు
 న్యూఢిల్లీ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రోహిత టాండన్‌ దేశంలోకెల్లా సంపన్నుడైన సుప్రీంకోర్టు న్యాయవాది. జీవితంలో ఒక్క కేసు వాదించింది లేదు. తాను పెట్టిన టీ అండ్‌ టీ న్యాయవాద కంపెనీ ద్వారా కార్పొరేట్‌ సంస్థల అధిపతులకు ప్రఖ్యాత న్యాయవాదుల్ని సమకూర్చడం, విదేశీ ఆయుధ కంపెనీలకు, రాజకీయ నాయకులకు మధ్య చీకటి ఒప్పందాలు కుదర్చడం.. ఇవీ ఆయన చేసే పనులు. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల స్కాం నిందితులు అభిషేక్‌ వర్మ, గౌతమ్‌ ఖైతాన్‌లతో సంబంధాలు బయట పడటంతో అప్పటి దాకా పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఆయనకు కష్టాలు ఒక్కసారిగా మొదలయ్యాయి. అక్టోబరు 6 నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆయన వెంట పడింది. రెండు నెలల్లో ఆయన ఇళ్లు, ఆఫీసులపై మూడు సార్లు దాడులు జరిగితే ప్రతీసారీ కోట్లకు కోట్లు నగదు, ఆస్తులు, డిపాజిట్లు బయటపడ్డాయి. ఇరవై రోజుల కింద ఒక ఇంటిపై ఐటీ అధికారులు దాడిచేస్తే రూ.కోటి దొరికాయి. తాజాగా అదే ఇంట్లో రూ.14 కోట్లు తీసుకొచ్చి దాచగల ధైర్యం టాండన్‌కే సొంతం. టాండన్‌ గత ఏడాదే వంద కోట్లు పెట్టి ఢిల్లీలో ఇల్లు కొన్నాడు. మరో వంద కోట్ల ఖర్చుతో కొడుకు పెళ్లి చేశాడు. రెండు నెలల క్రితం ఐటీ దాడుల్లో అడ్డంగా దొరికి పోవడంతో రూ.125 కోట్ల అక్రమ ఆస్తులను వెల్లడించాడు. ఇంకా ఆయన దగ్గర వందల కోట్లు మూలుగుతున్నాయి.
 
ఢిల్లీలో ఆయనకు అనేక ఇళ్లున్నాయి. వాటిల్లో జనం ఎవరూ ఉండరు. డబ్బులు దాచిపెట్టే గోదాములుగా ఉపయోగిస్తారు. శనివారం నుంచి ఆయన ఇళ్లు, ఆఫీసులపై మరో దఫా దాడులు జరిగాయి. ఈ సందర్భంగా దొరికిన సొమ్మును మెషీన్లతో లెక్క పెట్టడానికే రెండు రోజులు పట్టింది. టాండన్‌ ఇంటిపై ఐటీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించి వివిధ చోట్ల దాచిన రూ.14 కోట్ల నగదును, అత్యంత విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నగదులో రెండు వేల కొత్త నోట్లు రూ.2.6 కోట్లు ఉన్నాయి. పాత వెయ్యి నోట్ల రూపంలో రూ.7 కోట్లు, వంద నోట్ల రూపంలో రూ.3 కోట్లు, మిగిలినవి రూ.50 నోట్లు ఉన్నాయి. రెండు నెలల క్రితం ఐటీ నోటీసులిచ్చి సోదాలు చేసినపుడు రూ.19 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పత్రాలు లభించాయి.
 
ఇతర ఆస్తులూ వెలుగులోకి రావడంతో రూ.125 కోట్లు స్వచ్ఛందంగా బయట పెట్టారు. ఇక తన జోలికి రారులే అనుకున్నారు. పలుచోట్ల దాచిన పాతనోట్ల పాతరలు తెరిచి నోట్ల మార్పిడికి సిద్ధపడ్డారు. విషయం తెలిసి ఐటీ అధికారులు కాపేశారు. ఆదివారం రాత్రి గ్రేటర్‌ కైలా్‌షలోని ఆయన ఇంటికి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని ఆకాశరామన్న ఇచ్చిన సమాచారంతో మళ్లీ దాడులు నిర్వహించారు. 14 కోట్ల నగదుకు కేవలం ఇంటి నౌకరు కాపలాగా ఉన్నాడు. టాండన్‌ నుంచి ఇప్పటి వరకూ రూ.33 కోట్ల విలువైన ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. టాండన్‌కు దుబాయిలో, ఢిల్లీ చుట్టుపక్కల అనేక ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. 18 బ్యాంకు ఖాతాలున్నాయి.
 
లైవ్‌లో ఐటీ సోదాలు
సెల్‌ఫోన్లో వీక్షించిన టాండన్‌
సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత టాండన్‌కు చెందిన టీ అండ్‌ టీ కార్యాలయంపై శనివారం రాత్రి ఐటీ అధికారులు దాడి చేసినపుడు మొత్తం సోదాలను ఆయన లైవ్‌లో చూశారు. టాండన్‌ ఇళ్లు, ఆఫీసుల్లో ఏ స్విచ్‌ వేసినా ఆయన సెల్‌ఫోన్లో ఎలర్ట్‌ వస్తుంది. వెంటనే సంబంధిత ఇంటి సీసీటీవీ కెమెరాలను ఆన్‌ చేసుకొని తన ఐఫోన్లో లైవ్‌ చూడగలరు. అలాంటి సాంకేతిక ఏర్పాట్లతో ఉన్న రోహిత టాండన్‌ సోదాలు పూర్తయ్యే వరకు లైవ్‌లో చూస్తూ దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు.
 

No comments:

Post a Comment