కొత్తదనాన్ని
ఆస్వాదించడంలో ముందుండే హైదరాబాదీలకు కొత్త సంవత్సరంలో సరికొత్త అనుభూతి
కలగబోతోంది. ప్రయాణంలో ఉల్లాసం, ఉత్సాహం సొంతం చేసుకోబోతున్నారు. రద్దీ
మార్గాల్లో షేరింగ్ ఆటోలు, సిటీ బస్సుల్లో ప్రయాణించవలసిన అవసరం వచ్చే
జనవరి నుంచి ఉండదు. హాయిగా బైకు సవారీ చేయవచ్చు. ఈ సదుపాయాన్ని ఉబర్ ఇండియా
అందిస్తోంది. మంగళవారం బేగంపేటలోని తన క్యాంప్ ఆఫీస్‌లో సీఎం కేసీఆర్ ఉబర్
మోటో బైక్స్‌ను ప్రారంభించారు.
తెలంగాణ
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఉబర్ వ్యవస్థాపకుడు, సీఈఓ ట్రవిస్
కలనిక్ మంగళవారం కలిశారు. అనంతరం ఉబర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్,
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబర్
మోటో సర్వీసుల ఒప్పందంపై సంతకాలు చేశారు. ట్రవిస్ కలనిక్, తెలంగాణ
ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. మెట్రో స్టేషన్లకు నేరుగా
అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ సర్వీసులను అందజేయబోతున్నారు. ఉబర్ మోటో బైక్
షేరింగ్ ద్వారా ప్రయాణం చేయాలంటే మూడు కిలోమీటర్ల వరకు రూ.20
చెల్లించవలసి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తదుపరి ప్రతి
కిలోమీటర్‌కు రూ.5 చొప్పున చెల్లించాలి. బైక్ డ్రైవర్లకు ప్రస్తుతం శిక్షణ
ఇస్తున్నట్లు చెప్పారు.
మీడియా
సమావేశంలో ట్రవిస్ కలనిక్ మాట్లాడుతూ కొత్తదనాన్ని ఆదరిస్తున్న తెలంగాణ
ప్రభుత్వం ప్రగతిశీల ప్రభుత్వమని ప్రశంసించారు. తమ కంపెనీ ప్రధాన కార్యాలయం
శాన్ ఫ్రాన్సిస్కోలో ఉందని, తమ ఉద్యోగులు అత్యధికంగా ఉన్న నగరాల్లో శాన్
ఫ్రాన్సిస్కో తర్వాతి స్థానంలో హైదరాబాదే ఉందని తెలిపారు. తెలంగాణ ఐటీ
మంత్రి కేటీ రామారావుతో పాటు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి కూడా ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ
హైదరాబాద్‌లో కాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ట్రవిస్ అంగీకరించారన్నారు.
ఉబర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉందని, దానికి బయట ఉన్న
కార్యాలయాలన్నిటిలోనూ అత్యధిక ఉద్యోగులను హైదరాబాద్‌లోనే నియమిస్తోందని
తెలిపారు. హైదరాబాద్ శాఖలో 2 వేల మందికి పైగా ఉద్యోగులు ఉంటారని చెప్పారు.
ఈ
ఏడాది మార్చిలో గురుగ్రామ్‌లో బైక్ షేరింగ్ సర్వీసులను ఉబర్
ప్రారంభించింది. ఈ సర్వీసులకు రెగ్యులేటరీ సమస్యలు ఎదురవుతున్నాయి.
తెలంగాణలో అటువంటి సమస్యలు ఎదురవకుండా రవాణా శాఖాధికారులు చర్యలు
తీసుకుంటున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. బెంగళూరులో కూడా మార్చి నుంచే ఈ
సర్వీసులను ప్రారంభించింది. ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం తదితర
దేశాల్లో కూడా ఊబర్‌మోటో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
ఉబర్ బైక్‌ను ఎలా బుక్ చేయాలి?
ఉబర్మోటో సర్వీసును ఉపయోగించుకోవాలంటే సెల్‌ఫోన్‌లో ఉబర్ యాప్‌ను
డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్‌లో ఉబర్ మోటో అనే ఆప్షన్‌ను ఎంపిక
చేసుకోవాలి. బైక్ ఎక్కడ ఎక్కాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని తెలియజేయాలి.
తర్వాత బుక్ చేయాలి. వెంటనే ప్రయాణికుడి వద్దకు వెళ్ళే బైకు వివరాలు, దాని
డ్రైవర్ పేరు, ఫొటోలను ఉబర్ తెలియజేస్తుంది. బైకు డ్రైవర్‌తో పాటు దానిపై
ప్రయాణించే వ్యక్తి కూడా హెల్మెట్ సిద్ధంగా ఉంటుంది. ప్రతి ప్రయాణానికి
ముందు, ప్రయాణంలో, ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తారు.
జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, 2 వే ఫీడ్‌బ్యాక్, బంధుమిత్రులతో ఈ ప్రయాణం
గురించి తెలియజేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఛార్జీలను
నగదు రూపంలోనూ, ఆన్‌లైన్ పద్దతుల్లోనూ చెల్లించవచ్చు. ప్రస్తుతం
బెంగళూరులో ఇదే విధంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో కూడా ఇంచుమించు ఇలాగే ఉండే
అవకాశం ఉంది. బెంగళూరులో కనీస ఛార్జి రూ.15, కిలోమీటర్‌కు రూ.3 చొప్పున
వసూలు చేస్తున్నట్లు ఉబర్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌లో ఈ
చార్జిలు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు ఉబర్ నిర్ణయించిన ధరలను బట్టి
తెలుస్తోంది. హైదరాబాద్‌లో కనీస ఛార్జి రూ.20, కిలోమీటర్‌కు రూ.5 చొప్పున
వసూలు చేస్తున్నట్లు ఉబర్ ప్రకటించింది. ఇప్పటికే గురుగ్రామ్,
బెంగళూరువాసులు ఇటువంటి బైకు సవారీని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment