cricket ad

Thursday, 15 December 2016

నోట్ల కట్టలు.. బంగారం గుట్టలు విమానాశ్రయాల్లో పట్టుబడ్డ నగదు రూ.70 కోట్లు 170 కిలోల బంగారం కూడా స్వాధీనం పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న అక్రమాలు

నోట్ల కట్టలు.. బంగారం గుట్టలు
విమానాశ్రయాల్లో పట్టుబడ్డ నగదు రూ.70 కోట్లు
170 కిలోల బంగారం కూడా స్వాధీనం
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్న అక్రమాలు


  ముంబయి: పెద్దనోట్ల రద్దు తర్వాత వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు దర్యాప్తు అధికారుల్నే నివ్వెరపరుస్తున్నాయి. నవంబరు 8న నిర్ణయం వెలువడిన తర్వాత వివిధ విమానాశ్రయాల్లో పట్టుబడిన నగదు విలువ రూ.70 కోట్లకు పైమాటే. పాత నోట్లతో కొని తరలిస్తున్న 170 కిలోల బంగారం కూడా అధికారులకు స్వాధీనమయింది. దొరికిన నగదులో పాత, కొత్త నోట్లు కలిపి ఉన్నాయని సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఒ.పి.సింగ్‌ తెలిపారు.
చండీగఢ్‌ వ్యాపారి నుంచి రూ.2.2 కోట్లు: చండీగఢ్‌లోని ఓ వస్త్రవ్యాపారి వద్ద పెట్టెల్లో, గోనెసంచుల్లో ఉన్న రూ.2.20 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యాపారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. నాలుగు లాకర్లనూ సీజ్‌ చేసి, అక్రమ నగదు చలామణీ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లో మరో వ్యాపారి నుంచి రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో రూ.8 లక్షల విలువైన కొత్త రూ.2000,  రూ.500 నోట్లు ఉన్నాయి. ఈ వ్యాపారి వద్ద నుంచి 17 బ్యాంకు పాసు పుస్తకాలు, 40 ఏటీఎం కార్డులు, ఆధార్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గోవా రాజధాని పనాజీలో రూ.68 లక్షలు, రూ.24 లక్షలు వేర్వేరుగా లభ్యమయింది. కర్ణాటక, మహారాష్ట్రల పరిధిలో ఐ.టి. అధికారులు రూ.వెయ్యి కోట్ల విలువైన లెక్కల్లో చూపని నగదును బయటపెట్టారు.
దిల్లీ హోటల్లో రూ.3.25 కోట్లు: దిల్లీ పోలీసులు కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌పై దాడి చేసి అయిదుగురు వ్యక్తుల నుంచి రూ.3.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ముంబయికి చెందిన ఒక హవాలా వ్యాపారి సొమ్మేనని ప్రాథమిక విచారణలో తేలింది.
పుణెలో లాకర్లను సోదా చేసిన ఐ.టి.: పుణెలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు చెందిన పార్వతీఏరియా శాఖలో రూ.10 కోట్ల నగదు ఉందన్న అనుమానంతో ఐ.టి. అధికారులు లాకర్లను సోదా చేశారు. వీటిని సీజ్‌ చేసే అవకాశాలున్నాయి.
 కుక్కల్ని కాపలాపెట్టి బెదిరింపు..
రూ.2.89 కోట్లు స్వాధీనం

 బెంగళూరు యశ్వంతపురలోని ఓ భవంతిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడిచేసి రూ.2.89 కోట్ల నగదు స్వాధీనపరచుకున్నారు. ఇందులో రూ.2.25 కోట్ల కొత్త నోట్లు. సోమవారమే సమాచారం అందినా భవంతి ఎక్కడుందో గుర్తించేందుకు సమయం పట్టిందని ఆదాయ పన్నుశాఖ అధికార ప్రతినిధి అలెక్స్‌ మ్యాథ్యూ బుధవారం వివరించారు. ఒక వృద్ధురాలు ఆ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో ఉంటున్నారు. సోదాలకు వెళ్లినప్పుడు పెంచుకున్న శునకాలను ఉసిగొలిపిందని మ్యాథ్యూ వివరించారు. శునకాలను అదుపు చేసి ఆమె దాక్కున్న ఓ గది తలుపులు బలవంతంగా తెరిచారు. అక్కడే గుట్టలుగా నగదు ఉండటంతో అధికారులు అవాక్కయ్యారు. నవంబరు 9 నుంచి ఇప్పటి వరకు బెంగళూరు, చుట్టుపక్కల జిల్లాల్లో చేసిన దాడుల్లో రూ.29.86 కోట్ల కొత్త నగదు, 41.6 కిలోల బంగారం బిస్కెట్లు, 14 కిలోల బంగారు ఆభరణాలను నల్ల కుబేరుల నుంచి జప్తి చేశామని ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రకటించారు.

No comments:

Post a Comment