cricket ad

Saturday 10 December 2016

జయ'లేని అన్నాడీఎంకేకు చెక్... డీఎంకే వ్యూహం ఇదే...?

అన్నాడీఎంకేలో అన్నీ తానే అయి ఏళ్ల తరబడి చక్రం తిప్పిన 'అమ్మ' జయలలిత మరణంతో ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారనుందా? అమ్మ మాటే శిరోధార్యంగా నడిచిన రోజులు ఇక గతించినట్టేనా? పార్టీ పగ్గాలు ఒకరు, ప్రభుత్వం పగ్గాలు మరొకరి చేతిలో ఉండే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండే అవకాశాలున్నాయి? ఇవే ఇప్పుడు ఆ పార్టీ నేతలనే కాకుండా క్యాడర్‌నూ వేధిస్తున్న ప్రశ్నలు. ఇంతవరకూ.... అన్నాడీఎంకే, లేకుంటే డీఎంకే అన్న తరహాలోనే తమిళనాడు రాజకీయాలు సాగుతూ వచ్చేవి. ద్రవిడ పార్టీలకే తమిళ ఓటర్లు పట్టం కడుతూ వచ్చేవారు. జయ శకం ముగియడంతో అన్నాడీఎంకేకు ప్రధాన ప్రత్యామ్నాయమైన డీఎంకే....అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని...కొద్దికాలంగా కోల్పోయిన అధికార పగ్గాలు తిరిగి చేజిక్కించుకునేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించనుందనేది రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది.
 
అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి, ఆ పార్టీలో అధికార సంక్షోభం లేదా నేతల్లో అసంతృప్తులు బహిర్గతమయ్యేంతవరకూ వేచిచూడాలన్నది కరుణానిధి సారథ్యంలోని డీఎంకే పార్టీ తాజా వ్యూహంగా తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ఇప్పటికే లుకలుకలు తలెత్తాయా అనేది ఇంకా బయటపడకున్నా కొద్దిపాటి అసంతృప్తులు మొదలైనట్టేనని గత నాలుగైదు రోజుల పరిణామాలను బట్టి కొందరు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు జయలలిత మృతిని వైద్యులు ధ్రువీకరించడానికి కొద్ది గంటల ముందు జరిగిన కసరత్తు, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు వీలుగా జరిగిన లోపాయికారిగా హంగామా పట్ల, కీలకమైన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం పట్ల కొందరు పార్టీ సభ్యులు అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో వేగంగా చోటుచేసుకునేందుకు అవకాశమున్న పరిణామాలను నిశితంగా గమనించి తర్వాతే కార్యాచరణకు దిగాలని డీఎంకే పెద్దల వ్యూహంగా ఉంది. 'వేచిచూచే ధోరణే' ప్రస్తుతానికి పార్టీ వ్యూహమని డీఎంకే అధిష్ఠానం నుంచి ఆయా జిల్లాల కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో పరిణామాలపై ఎవరై నా అసంతృప్తులు ఉంటే వారు సహజంగానే డీఎంకే వైపు మళ్లుతారని, ఇప్పుడే హంగామా చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అన్నాడీఏంకేకు దగ్గరకావడం ద్వారా తమిళనాట బలంగా వేళ్లూనుకునే ప్రమాదం పొంచి ఉందని డీఎంకే అధిష్ఠానం భావనగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎలాగూ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున అప్పటిలోగా 'అమ్మ' లేని అన్నాడీఎంకే మనుగడపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు. ఇక అసెంబ్లీలో బలాబలాల పరంగా చూస్తే... 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలతో కలిస్తే 98 మంది సభ్యులున్నారు. అంటే ప్రభుత్వాన్ని దెబ్బతీయాలంటే మరో 19 మంది సభ్యుల్ని తమవైపు తిప్పుకుంటే చాలన్నమాట.

No comments:

Post a Comment