cricket ad

Monday 12 December 2016

ఎక్మో’ అంటే ఏమిటి? అమ్మకు ఆ చికిత్స ఎందుకు చేస్తున్నారు?

హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్... ఇవి వైద్య పరిభాషలో అత్యంత ప్రాణాపాయ స్థితిని తెలిపే పదాలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వచ్చింది గుండెపోటు కాదని.. గుండె ఆగిందని దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారని వైద్యులు చెబుతున్నారు. అపోలో ఆస్పత్రి ప్రకటనలో కూడా హార్ట్ అటాక్ అని రాయలేదు. కార్డియాక్ అరెస్ట్ అని తెలిపారు. శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరాను గుండె ఆపివేయడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తే పేషెంట్ శ్వాస తీసుకోవడం ఉండదు. స్పందనలు ఉండవు. అప్పుడు ఎక్మో అనే వైద్య యంత్రం సాయంతో రక్తం సరఫరా అయ్యేలా చేస్తారు. 
ఎక్మో(Extracorporeal membrane oxygenation-ECMO) పరికరాన్ని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ గా పరిగణిస్తారు. శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ అందకున్నా, రక్త సరఫరా సక్రమంగా జరగకున్నా, రోగి ఊపిరితిత్తులు, హృదయం చేయాల్సిన పనిచేయని వేళ ఎక్మోను వాడతారు. రోగి ఎప్పుడైతే సంప్రదాయ పద్దుతులైన సీపీఆర్ కు స్పందించరో… అప్పుడు ఎక్మో పరికరాన్ని వినియోగించి, కొంత వరకూ పరిస్థితిని చెయ్యి దాటకుండా నియంత్రించవచ్చు. రక్తనాళాల్లోని రక్త సరఫరాను పర్యవేక్షిస్తూ, రక్తానికి అవసరమైన ఆక్సిజన్ ను ఈ యంత్రం అందిస్తుంది. దీన్ని వాడుతుంటే శరీరంలోని రక్త ప్రసరణ గుండె, ఊపిరితిత్తులతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యంత్రం వాడుతూ ఒక రోగిని కొన్ని రోజులు, వారాల పాటు ప్రాణాలతో ఉంచవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 
ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయని స్థితిలోనే ఈ ఎక్మోను వాడతారు. వైద్యులు చివరిగా చేసే ప్రయత్నమే ఇది. కొంతకాలం పాటు శరీర అవయవాలు చేయలేని పనులను చేసే యంత్రమే ఈ ఎక్మో. రోగిలో కోలుకునే శక్తి ఏమాత్రం ఉన్నా, ఈ ఎక్మో పరికరం తన వంతు సహకారాన్ని అందిస్తుందని సీనియర్ కార్డియాలజిస్టులు చెబుతున్నారు. 
తమిళనాడు సీఎం జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎనిమిది మందితో కూడిన వైద్య బృందం జయలలితకు చికిత్స అందిస్తోంది. లండన్ వైద్యుల సూచనలతో చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఎక్మో సిస్టమ్ ద్వారా అమ్మకు వైద్యం అందిస్తున్నట్లు అపోలో జాయింట్ ఎండీ సంగీతారెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా స్పష్టం చేశారు.

No comments:

Post a Comment