cricket ad

Sunday 11 December 2016

ఈ దెబ్బకు బంగారం రేటు పదివేలకు పడిపోవడం ఖాయమనుకుంటున్నారా?

ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఒకటే ముచ్చట... మన దగ్గర ఎంత బంగారం వుంది? యాభై తులాలకంటే ఎక్కువ వుందా? అందులో మనం కొనుక్కున్నది ఎంత? పుట్టింటివాళ్లు, మెట్టినింటోళ్లు పెట్టింది ఎంత? వాటికి బిల్లులున్నాయా అని అత్తారింటోళ్లను ఇప్పుడు అడిగితే ఏమన్నా బావుంటుందా?... ఇలా రకరకాల సంశయాలు, చర్చలు.

ఇంతకు ముందు నగలు ధరించి బయటికి వెళ్లాలంటే చైన్‌ స్నాచర్ల భయం ఒక్కటే వుండేది. ఇప్పుడు ఐటీ స్నాచర్ల భయం కూడా పట్టుకుంది.

మరోవైపు... బంగారం తిక్క కుదిరింది. ఈ దెబ్బకు బంగారం కొనుక్కునే వాడే వుండడు. తులం బంగారం రేటు పదివేలకు పడిపోవడం ఖాయం. బంగారం కొట్లు మూతపడడం గ్యారంటీ... అని అనుకుంటున్న వాళ్లూ వున్నారు.

 
              ఈ కోల్డ్‌ సీజన్‌లో ఇది నిజంగానే హాట్‌ టాపిక్‌. కేంద్ర ప్రభుత్వం బోలెడంత వివరణ ఇచ్చింది. అయినా ప్రజల్లో సందేహాలు నివృత్తి కాలేదు. ఏమో... పెద్ద నోట్ల రద్దు గురించి కలగన్నామా? అలాగే బంగారంపై సర్జికల్‌ స్ట్రయిక్‌ జరగదని గ్యారంటీ ఏముంది? పైగా ఇది తొలి అడుగు మాత్రమేనని, మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. అయినా సరే అనేక సందేహాలు సామాన్యులను పట్టిపీడిస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం బంగారంపై కొత్తగా ఆంక్షలు ఏమీ విధించలేదు. అనేక సంవత్సరాలుగా అమల్లో వున్న నియమ నిబంధనలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ వాళ్లు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేసి ఎంత బంగారం వుందనే లెక్కలు తీయరు. ఆదాయానికి మించిన అక్రమార్జన వున్నట్లు తమ దృష్టికి వచ్చిన సందర్భాలలో మాత్రమే ఎంత బంగారం వుందనేది లెక్కతీస్తారు. అలా లెక్క తీసేటప్పుడు ఒక్క బంగారం గురించి మాత్రమే కాదు, అన్ని ఆస్తుల వివరాలు సేకరిస్తారు. 
 
అమల్లో వున్న చట్టం ఏం చెబుతోంది?
అవినీతితోనో, మరో రూపంలోనే కూడబెట్టిన సంపదను ఏసీబీ, ఐటీ అధికారులు పట్టుకున్నప్పుడు ఇన్ని కోట్ల డబ్బు, ఇన్ని కిలోల బంగారం దొరికిందని, స్వాధీనం చేసుకున్నారని మీడియాలో వార్తలు వస్తాయి. మొత్తం డబ్బు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నా, అందులో కొంత బంగారాన్ని తమ వద్దనే వుంచుకునే వెసులుబాటు టాక్స్‌ ఎసెసీలకు వుంది. సెక్షన్‌ 132(4) ప్రకారం ఎసెసీ భార్యకు 500 గ్రాముల వరకు మినహాయిస్తారు. అలాగే అవివాహితకు 250 గ్రాముల బంగారం కలిగి వుండడానికి మినహాయింపు వుంది. పురుషుడు 100 గ్రాముల బంగారం వరకు కలిగి వుండవచ్చు. వీటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. స్థూలంగా చెప్పాలంటే... చిన్న కుటుంబంలో భార్యాభర్తలకు కలిపి 600 గ్రాముల బంగారం వుండవచ్చు. అంటే అరవై తులాలు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలలో ఇంతకు మించి బంగారం వుండడం అరుదు.
 
‘పసిడి’ సందేహాలు ...
ఒకవేళ మధ్యతరగతి కుటుంబాల దగ్గర అరవై తులాలకు మించి వుంటే, ఆ మిగిలినదంతా ప్రభుత్వం లాగేసుకుంటుందా? మరో పెద్ద సందేహం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... అరవై తులాలకు మించి ఉంటే కూడా ప్రభుత్వం దాన్నేమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారాన్ని ఎలా సమకూర్చుకున్నారో ప్రభుత్వం అడిగినప్పుడు వివరణ ఇవ్వాలి. అది వారసత్వంగా వస్తున్న బంగారం కావొచ్చు. కష్టార్జితాన్ని పొదుపు చేసుకుంటూ అప్పుడప్పుడూ కొంత చొప్పున కొనుగోలు చేసినది కావచ్చు. ఆ వివరాలను అందజేస్తే సరిపోతుంది. అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రతి కొనుగోలుకు పన్ను చెల్లించి బిల్లు తీసుకోవడం చాలా మంచిది.  వారసత్వంగా విల్లు ప్రకారం వచ్చిన బంగారంపై కూడా ప్రజలకు హక్కు వుంటుంది. అయితే విల్లుపై ఇద్దరు సాక్షి సంతకాలు వుండాలి. పుట్టింటినుంచో, బహుమతిగానో, మరో విధంగానో వచ్చే బంగారానికి ఆధారపత్రం ఏదన్నా వుండేట్టు చూసుకోవడం మంచిది. బహుమతిగా పొందిన బంగారాన్ని విక్రయించేటప్పుడు బహుమతిగా పొందినప్పటి ధర, ఇప్పటి ధరల మధ్య వ్యత్యాసంపై పన్ను కట్టడం లాంటి నిబంధనలు వున్నాయి.
 
          కేంద్ర ప్రభుత్వ గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌, 1999 ప్రకారం... 2000-01 నుంచి గోల్డ్‌ డిపాజిట్‌ బాండ్లను జ్యువెలరీ కింద పరిగణించకుండా సెక్షన్‌2(ఈ)కి సవరణ వచ్చింది. దీని ప్రకారం గోల్డ్‌ డిపాజిట్‌ బాండ్లను ఆస్తులుగా పరిగణించరు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం ప్రవేశపెట్టిన పథకం ప్రకారం మన బంగారు ఆభరణాలను బ్యాంకులలో నిర్ణీత కాలవ్యవధికి జమచేసి, దానిపై వడ్డీ కూడా పొందే అవకాశం వుంది. బంగారానికి సంబంధించి ఇలా అనేక వెసులుబాట్లు వున్నాయి.  వ్యవసాయ ఆధారిత కుటుంబాలయితే ఈ విషయంలో చీకూచింతా లేకుండా వుండవచ్చు. ఓ పదెకరాల సాగుభూమి, పాడి కలిగిన రైతు కుటుంబం ఓ పదేళ్ల వ్యవధిలో కిలో బంగారాన్ని సమకూర్చుకోవడం అసాధ్యమైన విషయమేమీ కాదు. వ్యవసాయ ఆదాయంపై పన్ను లేనట్టే వ్యవసాయ ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారంపై కూడా ఎలాంటి పన్ను వుండదు. 
 
మన దగ్గర సెంటిమెంట్‌ ఎక్కువ ...
బంగారానికీ, భారతీయులకూ విడదీయరాని బంధం ఎప్పటినుంచో ఉంది. బతికినన్నాళ్లేకాదు, చచ్చిపోయే చివరిక్షణాల్లోనూ ఒంటి మీద బంగారం వుండాలని కోరుకుంటారు భారతీయ మహిళలు. ‘‘ఈ ఆడోళ్లున్నారు చూశారూ... బంగారం పేరెత్తితే చాలు, పడిచస్తారు.. ఒళ్లు మరిచిపోతారు. వాళ్లకదో వేలంవెర్రి’’.... ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి మగాళ్లనుంచి. అయితే మహిళలు ఎగబడితేనే, పడిచస్తేనే బంగారం ధర ఇంత దాకా వచ్చిందా?  భారతదేశంలో బంగారం అంటే చాలా క్రేజ్‌ వున్న మాట నిజం. ప్రపంచంలో పసిడి కొనుగోళ్లలో అందరికంటే ఇండియన్లే ముందున్నారన్నది వాస్తవం. ప్రతి సంవత్సరం భారతీయులు కొనుగోలు చేస్తున్న బంగారం దాదాపు 800 నుంచి 1000 టన్నులు. అయినా సరే బంగారం ధర హెచ్చుతగ్గులకు ఇదొక్కటే కారణం కాదు. అనేక అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల ప్రభావం బంగారం ధరపై వుంటుంది. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
 
అసలు ఎవరి దగ్గర ఎక్కువ వుంది?
భారతీయుల దగ్గరే బంగారం ఎక్కువ వుందని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అధికారంగా భారతదేశం దగ్గర, రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర వున్న బంగారం నిల్వలు చాలా తక్కువే. ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఎక్కువ బంగారం వున్నది అగ్రరాజ్యం అమెరికా దగ్గరే. అమెరికా రిజర్వ్‌ బ్యాంక్‌ (ఫెడరల్‌ రిజర్వ్‌) దగ్గర 8,133 టన్నుల గోల్డ్‌ వుంటే, ఇండియా దగ్గర వున్నది 557 టన్నులే. అమెరికా విదేశీ మారకద్రవ్యంలో బంగారం వాటా 80 శాతం అయితే, మన విదేశీ మారక ద్రవ్యంలో బంగారం వాటా 10 శాతమే. మనతో పోల్చితే చైనా దగ్గర రెట్టింపు బంగారం వుంది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా పసిడిని ఎగబడి కొనుగోలు చేస్తోంది. మన కంటే చిన్న దేశాల దగ్గర కూడా మనకంటే ఎక్కువ బంగారం నిల్వలు వున్నాయి. బంగారం నిల్వలు అధికంగా వున్న దేశాలే సంపన్న దేశాలుగా ప్రపంచ చిత్రపటంలో వెలుగొందడం గమనించాల్సిన అంశం. బంగారం నిల్వలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయనడానికి ఇది నిదర్శనం.
 
          ప్రపంచ చరిత్రలో బంగారం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. బంగారం కోసం స్పెయిన్‌ చేసిన యుద్ధాలు లోకవిదితం. అంతెందుకు... రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్‌ సేనలు అనేక ఐరోపా దేశాలపైకి దండెత్తినప్పుడు.. మొదటగా స్వాధీనం చేసుకున్నది బంగారాన్నే. కొల్లగొట్టిన బంగారంతో హిట్లర్‌ తన సేనలను మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాడు. గత చరిత్రనే కాదు... వర్తమాన మానవ చరిత్రనూ, దేశాల చరిత్రనూ బంగారం ప్రభావితం చేస్తూనే వుంది. పదేళ్ల క్రితం అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, డాలరుకు విలువ తగ్గిపోయాక బంగారం విలువ మరింత పెరిగింది. అప్పటిదాకా డాలరు నిల్వలలో పోటీపడిన ప్రపంచదేశాలు గోల్డ్‌ నిల్వలను పెంచుకోవడానికి పరుగులు తీశాయి. కాబట్టే పదిహేను సంవత్సరాల క్రితం 288 డాలర్లు వున్న ఔన్సు బంగారం ధర ఒక దశలో 2000 డాలర్లదాకా దూసుకెళ్లి ప్రస్తుతం 1200 డాలర్ల దగ్గర స్థిరంగా వుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీలపై ప్రజలకు నమ్మకం నానాటికీ సన్నగిల్లుతోంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌ కరెన్సీ అయిన డాలరుపై విశ్వాసం సడలిపోతోంది. డాలర్‌ ప్రామాణిక ఆర్థిక వ్యవస్థలో లుకలుకలు బయటపడుతున్నకొద్దీ సురక్షిత ఆర్థిక సాధనంగా గోల్డ్‌ నిలుస్తోంది. 
ఇప్పుడు భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు పరిస్థితిపై అనిశ్చితి నెలకొనడంతో బంగారాన్ని మించినది మరోటి లేదనే భావన మరోసారి బలపడుతోంది.
 
డిమాండ్‌ పెరగుతుందే తప్ప తగ్గదు...
సాధారణంగా ఉద్రిక్త పరిస్థితులు బంగారానికి డిమాండ్‌ పెంచుతాయి. టెన్షన్లు తగ్గినప్పుడు బంగారానికి డిమాండ్‌ తగ్గుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. జర్మనీ, జపాన్‌లు అమెరికా దగ్గర దాచుకున్న తమ బంగారాన్ని వెనక్కు తెచ్చుకుంటున్నాయి. నిక్సన్‌ హయాంలో గోల్డ్‌ స్టాండర్డ్‌ తొలగిపోయింది కానీ ఇప్పుడు మళ్లీ గోల్డ్‌ స్టాండర్డ్‌ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. డాలర్‌ నిల్వలు అనేది గతించిన చరిత్ర అని చైనా అధ్యక్షుడు అన్నారు. వెనెజులా డాలర్‌ వదిలేసి గోల్డ్‌కి పెద్దపీట వేసింది. ఇరాన్‌, రష్యాలు తమ మధ్య డాలర్‌ లేకుండా డైరెక్ట్‌ ఐపోయాయి. అలాగే చైనా, బ్రెజిల్‌ కూడా. ఇండియాకి ఇరాన్‌ డాలర్‌ లేకుండానే ముడిచమురు ఇస్తోంది. దీని అర్ధం బంగారానికి వన్నె తగ్గబోదని.
 
          అన్నింటికంటే ముఖ్యం... బంగారం ఉత్పత్తి ఏడాదికేడాది తగ్గిపోతోంది. కొత్త గనుల అన్వేషణ దాదాపుగా లేదు. గుర్తించిన గనులను తవ్వడం లాభసాటిగా లేదు. మరోవైపు అనేక రంగాలలో బంగారం వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అంతరిక్ష ప్రయోగాలు చేయాలన్నా, స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్లు తయారు చేయాలన్నా, కంప్యూటర్‌ మదర్‌ బోర్డులు తయారుచేయాలన్నా బంగారం తప్పనిసరి. ఎలక్ర్టానిక్స్‌ వస్తువుల తయారీలో ప్రతి సంవత్సరం ప్రపంచం ఉపయోగిస్తున్న బంగారం ఎంతో తెలుసా? మూడొందల టన్నులు. ఈ వినియోగం రానురాను మరింత పెరుగుతుంది. మొబైల్‌ ఫోన్‌ హ్యాండ్‌ సెట్స్‌లో వాడే గోల్డ్‌ కంప్యూటర్లలో కంటే ఎక్కువే.
 
        నానో టెక్నాలజీలో బంగారం సూక్ష్మకణాలను ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు సైంటిస్టులు. బంగారం ఇప్పటిదాకా ఆభరణాల విలువను, ఇన్వెస్ట్‌ మెంట్‌ విలువను మాత్రమే కలిగివుంది. ఇప్పుడు మరెన్నో విధాలుగా మానవాళి అభ్యున్నతికి దోహదపడుతోంది. ఆఫ్రికా దేశాలలో మలేరియా వ్యాధిని మట్టుబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కూడా గోల్డ్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. మెడికల్‌ పరీక్షల్లో, వ్యాధి నిర్ధారణలో బంగారం తోడ్పడుతోంది. ఈ అంశాలన్నీ కూడా బంగారం ధరను ప్రభావితం చేసేవే. బంగారానికి బంగారు భవిష్యత్తు వుందని నిర్ధారించేవే.
బంగారం... ఎప్పటికీ బంగారమే. ఇత్తడి పుత్తడి కావచ్చు కానీ, పుత్తడి ఎన్నటికీ ఇత్తడి కాదు.
‘బంగారు’ బాబులు
బంగారం అంటే కేవలం మహిళలకే పిచ్చి అనుకుంటే మీరు పొరపడినట్లే. తులాల చొప్పున కాకుండా కిలోల కొద్దీ బంగారాన్ని ఒంటిపై ధరించే మగరాయుళ్లూ ఉన్నారు. నాసిక్‌ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు పంకజ్‌ పరఖ్‌ (47)కు బంగారు ఆభరణాలు ధరించడమంటే చాలా ఇష్టం. అతడి ఒంటిపై ఉంగరాలు, గొలుసులు, బ్రాస్లెట్‌, వాచ్‌, కళ్లజోడు, మొబైల్‌ కవర్‌ రూపంలో ఎప్పుడూ పది కిలోలకు తగ్గకుండా బంగారం ఉంటుంది. అంతేకాదు.. 4.10 కిలోల బంగారంతో (దాని విలువ 1.30 కోట్ల రూపాయలు) చొక్కా కూడా కుట్టించుకుని గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. పంకజ్‌ తన భద్రత కోసం చుట్టూ సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టుకున్నాడు. పుణేకు చెందిన వ్యాపారవేత్త, గోల్డెన్‌మ్యాన్‌గా పేరొందిన దత్తాఫూగే (48)కూడా బంగారు చొక్కా కుట్టించుకుని అందరి దృష్టినాకర్షించాడు. ‘కొందరికి కార్ల పిచ్చి ఉన్నట్టే నాకు బంగారం పిచ్చి ఉంది’ అని చెప్పుకునే దత్తా ఒంటినిండా బంగారంతో కనిపించేవాడు. అయితే గత జూలైలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని పుణే శివార్లలో హత్య చేశారు.

No comments:

Post a Comment